మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు
ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, మే 19: స్టాక్ మార్కెట్ జోరు చూపించడం, ఈక్విటీల పట్ల రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరగడంతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి చేశాయి. రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపుచేయడంతో ఆ నిధుల్ని తిరిగి స్టాక్ మార్కెట్లోకి ఫండ్స్ మళ్లించాయి.
ప్రపంచ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సందిగ్గత ఉన్నా, దీర్ఘకాలిక దృష్టితో ఫండ్స్ ఈక్విటీల్లో పెట్టుబడి చేస్తున్నాయని ట్రేడ్‌జిని చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ త్రివేశ్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) పట్ల రిటైల్ ఇన్వెస్టర్లకు ఆసక్తి బాగా పెరిగిందని, మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఈ రూపంలో నిధులు మదుపు చేస్తున్నారన్నారు.
ఫైనాన్షియల్స్‌పై మొగ్గు
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అధికంగా ఫైనాన్షియల్ సర్వీసుల షేర్లలో ఉన్నాయి. తదుపరి స్థానాల్ని ఐటీ, ఫార్మాస్యూటికల్స్ ఆక్రమిస్తున్నాయి. గత ఏడాదికాలంగా ఫండ్స్ ఫార్మాస్యూటికల్, పవర్, కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్స్‌లో కేటాయింపులు పెంచాయి. 2024 మార్చినాటికి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల్లో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ వాటా 8.92 శాతానికి పెరగ్గా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల వాటా 11 ఏండ్ల కనిష్ఠస్థాయి 17.68 శాతానికి తగ్గింది.
ఫండ్స్ ఆస్తుల్లో 35 శాతం వృద్ధి
2023-24 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 35 శాతం వృద్ధిచెందినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సాధించిన 41 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యుత్తమ వృద్ధిగా అసోసియేషన్ పేర్కొంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 55 శాతం వృద్ధిచెంది రూ.23.5 లక్షల కోట్లకు చేరగా, హైబ్రీడ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు 50 శాతం పెరిగి రూ.7.2 లక్షల కోట్లకు చేరాయి. ఈక్విటీ మార్కెట్లు జోరుగా పెరిగినందున, ఈ ఫండ్స్ ఆస్తులు సైతం భారీగా వృద్ధిచెందాయి.
ఈ నెల తొలిపక్షంలోనే రూ.26 వేల కోట్లు
సెక్యూరిటీలు, ఎక్సేంజ్ బోర్డు (సెబీ) గణాంకాల ప్రకారం ఈ మే నెల మొదటి పక్షం రోజుల్లోనే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రూ. 26,038 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఏప్రిల్ నెల మొత్తంలో ఫండ్స్ చేసిన పెట్టుబడులు రూ.20,155 కోట్లు. 2024లో ఇప్పటివరకూ అత్యధికంగా మార్చి నెలలో దేశీయ ఫండ్స్ రూ.44,233 కోట్ల విలువైన నిధుల్ని మార్కెట్లో కుమ్మరించాయి. అవి ఫిబ్రవరిలో రూ.14,295 కోట్లు, జనవరిలో రూ.23,010 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి. ఈ ఏడాది మే 16 వరకూ ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 1.30 లక్షల కోట్లకు చేరాయి.






