calender_icon.png 14 November, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు

14-11-2025 10:09:23 PM

నల్లగండ్లలోని శిశు మంగళ్ అనాథాశ్రమ విద్యార్థులతో ఆహ్లాదంగా ఓ రోజు

పటాన్ చెరు: బాలల దినోత్సవాన్ని శుక్రవారం గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరే, ఈసారి కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలోనే ఆనందం) పేరిట నల్లగండ్లలోని శిశు మంగళ్ అనాథాశ్రమ విద్యార్థులను గీతంకు ఆహ్వానించి, రోజంతా వారిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, దయ, దాతృత్వ స్ఫూర్తిని చాటారు. వారిలో కొంగొత్త ఆశలను రేకెత్తించారు. శిశు మంగళ్ కు చెందిన ముగ్గురు స్వచ్ఛంద సేవకుల నేతృత్వంలోని 47 మంది బాలలను ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గీతం ప్రాంగణానికి ఆహ్వానించి, వారితో కలిసి ఆనందంగా, వినోదాత్మకంగా, అర్థవంతమైన కార్యక్రమాలతో రోజంతా గడిపారు.

ఆ బాలల కోసం ఆకర్షణీయమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంబీఏ విద్యార్థులు నిర్వహించారు. తాము అనాథలం కాదు, మనకోసం ఎందరో ఉన్నారనే ఐక్యతా వాతావరణాన్ని సృష్టించడమే గాక, వివిధ పోటీలలో గెలుపొందిన వారందరికీ ఆకట్టుకునే బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎంబీఏ విద్యార్థులలో సానుభూతి, సామాజిక బాధ్యత, నాయకత్వం యొక్క విలువలను పెంపొందించడానికి తోడ్పడింది. వారు తమ ఆదర్శనీయమైన పనులు, సంభాషణల ద్వారా సానుకూలతను ప్రేరేపించడమే గాక, సమాజాభివృద్ధికి గీతం యొక్క నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీ-స్కూల్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా పాల్గొని, విద్యార్థుల చొరవను ప్రశంసించారు.

ఇంత మంచి సంప్రదాయాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు అభినందించారు. కీలకమైన నాయకత్వ లక్షణం- కరుణ యొక్క ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ‘జాయ్ ఆఫ్ గివింగ్’ కార్యక్రమాన్ని జీఎస్ బీ అధ్యాపకురాలు డాక్టర్ నాగప్రియ, విద్యార్థి నిర్వాహకులు దీక్ష, షేక్ అంజుమాతో కలిసి సమన్వయం చేశారు. బాలల సంక్షేమం, విద్య పట్ల గీతం యొక్క అచంచలమైన అంకితభావంలో భాగంగా, శిశు మంగళ్ బాలలందరికీ స్వెట్టర్లు, స్టేషనరీ, టీ-షర్టులను పంపిణీ చేశారు. దీనికి అదనంగా, విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సమిష్టిగా లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఇది అర్థవంతమైన, స్థిరమైన సమాజ కార్యక్రమాల ద్వారా యువ జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలనే గీతం లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.