11 August, 2026 | 2:03 AM

జెన్ జీ మరో పోరు

11-08-2026 12:00 AM

విద్యావ్యవస్థలో లోపాలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ఉద్యోగ నియామకాల్లో అవినీతిపై దేశవ్యాప్తంగా వరుసగా ఉద్యమాలు జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జెన్ జీ యువత ఉద్యమం చేసిన విషయం విదితమే.

ఆ ఉద్యమం రగిల్చిన నిరసన జ్వాలలు ఆరకముందే, ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన దేశ విద్యావ్యవస్థలో వేళ్లూనుకుపోయిన సంస్థాగత అవినీతి, అక్రమాలపై యువత అసంతృప్తిని, అసహనాన్ని, ముఖ్యంగా తప్పులని సహించకుండా అలుపెరగని పోరు సలిపే యువత పోరాటతత్వానికి అద్దం పడుతున్నది.

ఢిల్లీలో జెన్ జీ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఝార్ఖండ్‌కు చెందిన విద్యార్థి ఉద్యమ నేత దేవేంద్రనాథ్ మహతో నాయకత్వంలో అక్కడి యువత చేపట్టిన నిరసనలు కూడా ఫలించడం ముదావహం. విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన ఝార్ఖండ్ సర్కార్ పరీక్షను రద్దు చేయక తప్పలేదు. అయితే, ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీయడం గమనార్హం.

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తున్న విద్యార్థులపై భద్రతా బలగాలు లాఠీచార్జి చేయడం, జలఫిరంగులను ప్రయోగించడం ఆందోళనకరం. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల హక్కును గౌరవించాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసినప్పటికీ విద్యార్థులపై దాడులకు పాల్పడటం గర్హనీయం. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదని పాలకులు గుర్తించాలి. ముఖ్యంగా ప్రశ్నించేతత్వాన్ని ఆయుధంగా మార్చుకున్న నేటి యువత అన్యాయాన్ని ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. న్యాయం కోసం ప్రభుత్వాలను, పాలకులను నిలదీసేందుకు వారు వెనుకాడటం లేదు.

నీటిపై రాతల్లాంటి పాలకుల హామీలు, మాటల గారడీలు, అసంబద్ధమైన వాగ్దానాలను జెన్ జీ విశ్వసించడం లేదని చెప్పడానికి ఇది ప్రత్యక్ష తార్కాణం. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, ముఖ్యంగా వ్యవస్థలో లోపాలను ఇకపై సాధారణ నేరాలుగా పరిగణించే పరిస్థితి లేదని చెప్పవచ్చు. తక్షణ చర్యలను యువతరం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు బయలుదేరే అవకాశం ఉన్నది.