11 August, 2026 | 3:26 AM

భారతీయ సినీ సామ్రాట్ జైరాజ్

11-08-2026 12:00 AM

భారతీయ చలనచిత్ర రంగుల ప్రపంచంలో మూకీ యుగం నుంచి టాకీ యుగం వరకు, అటుపై డిజిటల్ పరిణామక్రమానికి ముందటి దాకా ఆటుపోట్లను తట్టుకుంటూ స్వయం ప్రతిభతో వెలిగిన మహానటుడు పైడి జైరాజ్. అమోఘమైన నటన, అసాధారణ దేహదారుఢ్యం, ఉచ్ఛారణలో గాంభీర్యం తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు ముంబయి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అపూర్వ కళాకారుడాయన.

1909 సెప్టెంబర్ 28న అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని సిరిసిల్ల ప్రాం తంలో జన్మించిన పైడిపాటి జయరాజులు, తరువాతి కాలంలో ‘పైడి జైరాజ్’గా భారతీయ సినీ యవనికపై చెరగని ముద్రవేశారు. నాటి నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే నాటకరంగం పట్ల, సినిమాల పట్ల జైరాజ్ ఆకర్షితులయ్యారు. కళపై ఉన్న అపరిమితమైన మక్కువ ఆయనను 1929లో బొంబాయి వైపు నడిపించాయి. ఏ అండదండలు లేని ఆ రోజుల్లో స్వయంకృషినే నమ్ముకుని మూకీ చిత్రాల జగత్తులోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

‘స్టార్ క్లింగ్ యూత్’, ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘ఫ్లైట్ ఇన్‌టు డెత్’ వంటి సుమారు పదకొండు మూకీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొంది విజయకేతనాన్ని ఎగురవేశారు. 1931లో ‘ఆలమ్ ఆరా’ రాకతో భారతీయ చలనచిత్ర సీమలో శబ్ద శకం ప్రారంభమైన ప్పుడు చాలామంది మూకీ నటులు భాషా లోపాలు, గొంతు స్వభావం సరి గా లేక వెనుకంజ వేశారు. కానీ, జైరాజ్ ఆ సవాల్‌ను సైతం స్వీకరించి ‘షికారి’ (1932) వంటి తొలి టాకీ చిత్రంతో తన నటనా ప్రయాణానికి సరికొత్త రూపునిచ్చారు. నాటి రోజుల్లో నటులే స్వయంగా పాటలు పాడాల్సి రావడంతో, సంగీతంలో పూర్వానుభవం లేకపోయినా వెరవక ప్రసిద్ధ సంగీతవేత్త బి.ఆర్. దేవధర్ వద్ద శ్రమకోర్చి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు.

ఈ పట్టుదలే ఆయనను హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషల్లో సుమారు 170కి పైగా చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేలా చేసింది. ప్రత్యేకించి చారిత్రక, పౌరాణిక, సాహస ఇతివృత్తాలలో జైరాజ్‌ను మించిన నటుడు లేరనే పేరు వచ్చింది. సృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, రజియా సుల్తా న్, అల్లావుద్దీన్, టిప్పు సుల్తాన్, జై చిత్తోడ్, రాణా హమీర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఆయనను చారిత్రక నటనకు చిరునామాగా మార్చాయి. ‘షహీద్ ఎ భగత్‌సింగ్’ చిత్రంలో చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన కనబరిచిన నటన, ఆవేశం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో డూప్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండానే గుర్రపు స్వారీ, కత్తిసాము, ప్రమాదకరమైన విన్యాసాలను జైరాజ్ స్వయంగా చేసేవారు. నటనా పరిధికి మాత్రమే పరిమితం కాకుండా 1940లలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ‘మోహర్’, ‘మాలా’, ‘ప్రతిమ’, ‘రాజ్‌ఘర్’, ‘సాగర్’ వంటి చిత్రాలను మలిచారు. ‘సాగర్’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించి చలనచిత్ర నిర్మాణంలో తనకున్న లోతైన అవగాహనను నిరూపించుకున్నారు. ఆయన సినీరంగానికి చేసిన అపారమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1980లో ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’తో సత్కరించింది.

తెలంగాణ నేల అందించిన ఒక గొప్ప కళారత్నం, మాతృభాషను హృదయం లో పదిలంగా దాచుకుంటూనే జాతీయ స్థాయిలో హిందీ సినీ సామ్రాజ్యాన్ని ఏళ్ల తరబడి ఏలడం యావత్ తెలుగు జాతికే గర్వకారణం. 2000 ఆగస్టు 11న ముంబయి నగరంలో 90 ఏళ్ల వయసులో ఈ మహానటుడు తుదిశ్వాస విడిచారు. నటుడి భౌతికకాయానికి కాలం పరిమి తి విధించవచ్చు గానీ, ఆయన వెండితెరపై వదిలివెళ్లిన అద్భుత పాత్రలు, నటనలోని గాంభీర్యం కాలాతీతంగా నిలిచిపోతాయి. ఆగస్టు 11న ఆయ న వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడి సుదీర్ఘ ప్రస్థానాన్ని, స్ఫూర్తిదాయక జీవితాన్ని స్మరించుకోవడం మన బాధ్యత. భారతీయ సినీ చరిత్ర పుటల్లో జైరాజ్ పేరు ఒక సువర్ణ అధ్యాయంగా, తరువాతి తరాలకు మార్గదర్శకంగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494

రామకిష్టయ్య సంగనభట్ల