07-02-2026 05:24:50 PM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్
కాగజ్ నగర్,(విజయ క్రాంతి): ఫిబ్రవరి 12న జరగనున్న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికులంతా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. AITUC ఆధ్వర్యంలో కాగజ్ నగర్ MLS పాయింట్ ఇంచార్జి ప్రభు లింగం, కాగజ్ నగర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అవినాష్ గారికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా భోగే ఉపేందర్ మాట్లాడుతూ, 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లై హమాలి కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా హమాలి రేట్లు పెంచాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు మరియు IHFMS కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే పేదలకు ఉపాధి గ్యారంటీ ఇస్తున్న MGNREGA చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.నాలుగు లేబర్ కోడ్లు, వాటి నిబంధనలను పూర్తిగా రద్దు చేయాలి.
జిల్లాలోని సివిల్ సప్లై హమాలి కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ, సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులతో పాటు స్కీం వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, NHM, హెల్త్ డిపార్ట్‌మెంట్ తదితర విభాగాల కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. NHMలోని అన్ని క్యాడర్లను, స్కీం వర్కర్లను రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలని, 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలని, స్కీం కార్మికుల కోసం ప్రత్యేక పే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రెగ్యులరైజేషన్ జరిగే వరకు నెలకు రూ.26,000 కనీస వేతనం, రూ.10,000 పెన్షన్ చెల్లించాలని, పని గంటలను ఎనిమిది గంటలకు పరిమితం చేసి పనిభారాన్ని తగ్గించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు అమలు చేయాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ ప్రకటించే వరకు పదవీ విరమణ చేయరాదని, సీనియారిటీ ప్రాతిపదికన ఆశా వర్కర్లకు ANM పోస్టుల్లో పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు కుమార్, సురేష్, అంజి, సుధాకర్, సాయి, కిషన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.