11 May, 2026 | 6:27 AM

కారు దిగి కమలం వైపు అడుగులు

22-06-2024 03:24 AM
  • బండి సంజయ్‌ను కలిసేందుకు కార్పొరేటర్ల పోటా పోటీ
  • ముందు వీరు.. తర్వాత ఎమ్మెల్యే
  • బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు

కరీంనగర్, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బలహీనపడడం, మరో ఆరు నెలల్లో నగరపాలక సంస్థ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో ఉంటే తమ ఉనికికి ప్రమాదమని గ్రహిస్తున్న కొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను కలిసేందుకు పోటీ పడుతున్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉన్న సమయంలో ఏనాడూ ఆయనను కలవని, ఏ కార్యక్రమానికి ఆహ్వానించని మేయర్ సునీల్‌రావు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాగానే పొగడ్తలతో ముంచడం చూస్తే వరుసకట్టి బీజేపీలో చేరతారనే ప్రచారానికి బలం చేకూరిం ది.

స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అని ప్రతీ సమావేశంలో చెప్పిన సునీల్‌రావు.. నిధులు రావడానికి బండి సంజయ్ కారణమని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పడం పార్టీ మారుతారన్న ప్రచారాన్ని నిజం చేసినట్లయింది. కేంద్ర మంత్రి అయినందున మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని కార్పొరేటర్లు చెప్తున్నప్పటికీ ఇప్పటికే సంజయ్‌తో మంతనాలు జరిపి త్వరలో ముహూర్తం ఖరారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని సొంత పార్టీవారే చెబుతున్నారు.

శుక్రవారం జ్యోతినగర్, కోతిరాం పూర్, కిసాన్‌నగర్, విద్యానగర్‌లకు చెందిన కార్పొరేటర్లు గందె మహేశ్, ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, కచ్చు రవి బండి సంజయ్‌ని కలిసి సన్మానించారు. కచ్చు రవి ఏకంగా సంజయ్‌కి సాష్టాంగ నమస్కారం చేశారు. బండి కేంద్ర మంత్రి అయిన సందర్భంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేయడం, ఆ తర్వాత మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండడం వీరి చేరికను ఖాయం చేస్తున్నది.