02-11-2025 03:23:42 PM
సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
చండూరు,(మర్రిగూడ)(విజయక్రాంతి): కార్మిక వర్గ హక్కుల సాధన కోసం కార్మికులందరూ సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు మర్రిగూడ మండల జనరల్ బాడీ సమావేశం నక్క నరసింహఅధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
1970లో ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని నాటినుండి నేటి వరకు కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడం కోసం వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడుదారులకు అప్పనంగా అప్పజెప్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందర కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు.కార్మిక వర్గ సమస్యల పై చర్చించడానికి నవంబర్ 29,30న నల్లగొండలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సిఐటియు మర్రిగూడ మండల కన్వీనింగ్ కమిటీని 17 మందితో కమిటీ వేయడం జరిగింది.