calender_icon.png 18 July, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమోషన్లకు పడిగాపులు!

07-08-2024 01:56:04 AM

  1. వ్యవసాయ శాఖలో 917 పోస్టులు ఖాళీలు 
  2. గత ప్రభుత్వం పదోన్నతుల విషయం పట్టించుకోలె 
  3. ఈ సర్కారైన గోడు వినాలని ఉద్యోగుల విన్నపం 
  4. అనుబంధ శాఖల్లో మూడేళ్ల కితమే పదోన్నతులు పూర్తి 
  5. బదిలీల ప్రక్రియ పూర్తున వెంటనే చేపట్టాలని సూచన 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖలో ప్రమోషన్లు, నియామకాలు చేపట్టకపోవడంతో ఇంచార్జీలతో కాలం వెల్లదీసే పరిస్థితి నెలకొంది. అదనపు పని భారంతో విధులు నిర్వహించలేక చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొం టున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకునే నాథుడే లేడు. కనీసం రేవంత్ సర్కార్ అయిన తమను కనికరించి పదోన్నతుల ప్రక్రియ చేపడుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండటంతో తరువాత అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు.

బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుండటంతో అదే తరహాలో పదోన్నతుల దస్త్రం కూడా కదలించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు, నియమాకాల ఊసేలేదు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో మండల, జిల్లా సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 917 పోస్టులు ఖాళీగా ఉండగా, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులు పెంచుకొనే అవకాశం ఉంది. 

ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల ఫైళ్లకు దుమ్ము పట్టింది. కొత్తగా కొలువుదీరిన  కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన మార్కెటింగ్, ఉద్యానవన, సహకారం, పశుసంవర్ధక శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ మూడేళ్ల కితమే ముగిసింది. వ్యవసాయశాఖలో మాత్రం పద్నోతుల ప్రక్రియ అటకెక్కింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెల రోజుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తామని, కొత్త పోస్టులు మంజూరు చేస్తామని ప్రకటించినా.. హామీలకే పరిమితమైంది.

కనీసం ఉద్యోగుల సీనియార్టీ లిస్టు కూడా సిద్ధం చేయలేదు. రెండేళ్ల సర్వీసు నిండిన వారంతా పదోన్నలకు అర్హులైనప్పటికి ఐదేళ్లుగా ఎక్కడి వారే అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పదోన్నతులు ఇస్తే 55 మందికి ఏవో నుంచి ఏడిఏగా, 47 మందికి ఏడిఏ నుంచి డీడీఏగా, 13 మంది డీడీఏ నుంచి జేడీఏగా అవకాశం దక్కనుంది. 

18 జిల్లాలకు ఏడీఏలే బాస్‌లు

నిబంధనల ప్రకారం ప్రతి జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులే డీఏవోగా ఉండాలి. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలకు ఏడీఏ స్థాయి అధికారులే ఇన్‌చార్జి డీఏవోలుగా కొనసాగుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన వ్యవసాయ డివిజన్లకు ఏడీఏలను, కొత్తగా ఏర్పడిన 128 మండలాలకు ఏవోలను నియమించలేదు. దీంతో అక్కడా ఇంచా ర్జీలతోనే నెట్టుకొస్తున్నారు. 917 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడం తోపాటు కొత్తగా ఏర్పాటైన డివిజన్లు, మండలాలకు అధికారులను నియమిస్తే అదనంగా మరో 539 పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. మరోవైపు ఐదో, ఆరో జోన్‌ల్లో సూపర్ న్యూమర్ పోస్టుల సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టి కొత్త పోస్టులు మంజూరు చేయాలని అధికారులు కోరుతున్నారు.