07-08-2024 01:49:29 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి విధానాలతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. గ్రూప్ వన్ ఓపెన్ కోటాకు సంబంధించి జీవో 55ను కేసీఆర్ తీసుకొస్తే, రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల ఆశలకు తూట్లు పొడిచే విధంగా జీవో 29ని తీసుకొచ్చారని మండిపడ్డారు. సామాజిక న్యాయ మంటూ రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గం తూట్లు పొడుస్తుందని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని జీవో 29ను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని ధ్వజమెత్తారు. గ్రూప్ వన్, గ్రూప్ 2లో రిజర్వేషన్లు ఏవిధంగా పాటించాలి అని జీవో 55 చెప్తోందని అన్నారు. గ్రూప్ వన్‌లో 563 పోస్టులకు నిర్వహించిన పరీక్షకు దాదాపు 3 లక్షల మంది హాజరై య్యారని, మెయిన్స్‌కు ఒక పోస్టుకు 1 ః 50 నిష్పత్తిలో 28,150 మందిని ఎంపిక చేయాలని చెప్పారు. కానీ, ఓపెన్ క్యాటగిరి కింద అగ్రవర్ణాలకే ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తుందని ఆరోపించారు.
ఓపెన్ కోటా కింద అన్నివర్గాలు వస్తారని తెలిపారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అగ్రవర్ణ పేదలు కాంగ్రెస్ సర్కార్‌కు ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. ఓపెన్ కోటాపై గూడు పుఠానీ నడుస్తోందని, ఈ వర్గాల కోటా కటాఫ్ చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అం జనేయులుగౌడ్, అభిలాష్ రంగినేని, తుంగ బాలు, రామమూర్తి పాల్గొన్నారు.