22 April, 2026 | 1:35 AM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి!

22-04-2026 12:00 AM
  1. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ
  2. సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం 
  3. మహిళా బిల్లు విషయంలో బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
  4. డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 21(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం  సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్ , మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, పఠాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

ఈ  సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ  స్థానాలు గెలిచామని,  మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను చేపట్టినా, ఆ సందేశాన్ని, స్ఫూర్తి ని ప్రజల్లోకి తీసుకెళ్ళా ల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల  పైనే ఉంటుందన్నారు. 

కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటినుండే సన్నద్ధం కావాలి, పార్టీ నాయకుల మధ్య వర్గ పోరు ఉండొద్దన్నారు. నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటం సహజమే.. కానీ వర్గ పోరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. డ్భె వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని,  ఇప్పటివరకు కేవలం ఆరోగ్య శాఖలోనే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా డిజిటల్ హెల్త్ కార్డ్ లు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్  ఆసుపత్రులలో మరో 50 పడకలు అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల లో భవిషత్తు లో  పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రూ.200 కోట్లతో సింగూరు ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు.

నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి  అనే విషయంలో చర్చ జరగాలన్నారు. మన మధ్యే మనకే పోటీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఎందుకు మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ  అడ్డుకుందో, మహిళా బిల్లు విషయంలో బీజేపీ కుట్రలను సైతం పార్టీ పరంగా చర్చ జరగాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్, నీలం మధు, కాటా శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ  జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, పిసీసి ప్రధాన కార్యదర్శులు తోపాజి అనంత్ కిషన్, చిన్నా ముదిరాజ్, నాయకులు శశికళా యాదవ్ రెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారయణ, కొహీర్, జోగిపేట మున్సిపల్ చైర్మన్ లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.