27-01-2026 10:36:29 AM
వివాదాస్పద స్థలంలో అక్రమ అనుమతులు
కూల్చివేతకు నోటీసులిచ్చినా డోంట్ కేర్
రూ.కోటి లంచం ?
మణికొండ: జిహెచ్ఎంసి నార్సింగి సర్కిల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కాసుల కక్కుర్తిలో పడి నిబంధనలను తుంగలో తొక్కుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) మనోహర్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అక్రమమని తేల్చి, కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిన నిర్మాణాలకే, నేడు కాసులు రాల్చగానే పచ్చజెండా ఊపుతూ తనలోని అవినీతి విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అల్కాపురిలోని జయశంకర్ పార్కు సమీపంలో ఉన్న 1000 గజాల వివాదాస్పద స్థలంలో దాదాపు నిర్మాణం పూర్తయిన ఒక భవనానికి అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏసీపీ మనోహర్ దాదాపు కోటి రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఈ 1000 గజాల స్థలంలో గతంలో ఒక బావి ఉండేది. దానిపై భారీ నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఈ మేరకు గూగుల్ మ్యాప్ జియో ట్యాగింగ్‌తో సహా పక్కా ఆధారాలను అప్పటి కమిషనర్ ప్రదీప్ కుమార్‌కు అందజేశారు. విచారణ చేపట్టిన ప్రదీప్ కుమార్, అది అక్రమ నిర్మాణమని తేల్చి, పనులు తక్షణమే నిలిపివేయాలని, కట్టడాన్ని కూల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, అధికారుల పీఠం మారగానే కథ మారింది. ప్రదీప్ కుమార్ బదిలీ కాగానే, ఏసీపీ మనోహర్ రంగప్రవేశం చేసి అక్రమార్కులకు అండగా నిలిచాడు. కూల్చివేయమని నోటీసులు ఇచ్చి నాలుగు నెలలు కూడా గడవక ముందే, అదే భవనానికి ఎల్ఆర్ఎస్ పత్రాలను సృష్టించి మరీ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. అసలు అనుమతులు లేవని భవనాన్ని వెంటనే కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసిన భవనానికి రాత్రికి రాత్రే అనుమతులు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న మనోహర్, ఈ అక్రమ నిర్మాణాన్ని చట్టబద్ధం చేసేందుకు నిబంధనలన్నింటినీ గాలికి వదిలేశాడు. కోర్టు పరిధిలో ఉన్న ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులు గతంలోనే అక్రమమని తేల్చారు. అయినా సరే, బిల్డర్ వద్ద భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆఫీసులో కూర్చొని అంతా తానై వ్యవహరించాడు. భవనం పూర్తి దశకు చేరుకున్నాక అనుమతులు ఇవ్వడం, లేని ఎల్ఆర్ఎస్‌ను ఉన్నట్లు చూపించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది స్పష్టమవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే.. "అంతా నా ఇష్టం, నేను చేసిందే రూల్" అనే రీతిలో మనోహర్ వ్యవహరిస్తున్నాడని సమాచారం. అక్రమార్కులకు అలుసు ఇస్తూ, సామాన్యుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
కేవలం అల్కాపురిలోనే కాదు, మణికొండ పరిధిలోనూ మనోహర్ అవినీతి దందా యథేచ్ఛగా సాగుతోంది. రెండు, మూడు అంతస్తుల నిర్మాణాలు ఇంకా పూర్తికాకముందే, బిల్డర్ల నుంచి భారీగా డబ్బులు దండుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం భవనం పూర్తయ్యాకే ఓసీ ఇవ్వాల్సి ఉన్నా, లంచాలకు అలవాటు పడిన ఈ అధికారికి అవేమీ పట్టడం లేదు. అధికారిక విధులను పక్కనపెట్టి, అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మనోహర్‌పై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు