27-01-2026 10:49:59 AM
నైని కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే టాపింగ్ కేసు డ్రామా
ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే సిట్ డ్రామా
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనుముల భాస్కర్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): బోయినిపల్లి మండలం టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు అనుముల భాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మొత్తం సిట్ విచారణ ప్రక్రియ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ నాటకమని విమర్శించారు. కేసుకు అసలు సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ వరుసగా విచారణకు పిలవడం వెనుక స్పష్టమైన రాజకీయ కక్షసాధింపు దాగి ఉందన్నారు.
ప్రజా సమస్యలు, అభివృద్ధి వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ ఈ తరహా విచారణల హడావుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని సృష్టిస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు, కుంభకోణాల నుంచి ప్రజల చూపు మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్‌ను ఒక రాజకీయ ఆయుధంలా ఉపయోగిస్తోందని భాస్కర్ మండిపడ్డారు.నైని బొగ్గు గనుల కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల డ్రామా నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇదే కేసు పేరుతో హరీష్ రావును,కేటీఆర్ ను కూడా విచారించినా ఏమీ తేలలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌ను సంతోష్ కుమార్ పై ప్రయోగిస్తూ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని భాస్కర్ విమర్శించారు.