27-01-2026 02:12:14 AM
‘వ్యాప్కోస్’కు సింగరేణి హైడల్ ప్రాజెక్ట్ డీపీఆర్ బాధ్యతలు
టెండర్లు పిలువకుండానే ఆ సంస్థకు రూ.౭ కోట్ల కాంట్రాక్ట్
కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్ రూపకర్త ఈ సంస్థే
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురైనా డోన్ట్ కేర్!
రూ.౩ వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌పై నీలినీడలు
సర్కార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శల వెల్లువ
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ప్రతి ష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ హైడ ల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్డ్ (డీపీఆర్) రూపకల్ప న బాధ్యతలను వివాదాస్పద సంస్థ వాట ర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)కు అప్పగించడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరతీసింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ ఇవ్వగా, మేడిగడ్డ బరాజ్ కట్టిన కొద్దినెలలకే కుంగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే సంస్థకు ఎలాంటి టెండర్లు లేకుండా రూ.౭ కోట్ల ఒప్పందంతో కాంట్రాక్ట్ అప్పగించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.
దీని వెనుక సర్కార్ మతలబు ఏమి టి? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ పరిస్థితీ కాళేశ్వరం బరాజుల్లా కుంగిపోవు కదా..’ అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సింగరేణి సంస్థ రాష్ట్రంలోనే మొదటిసారిగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తలచింది. 500 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని రామగుండొోం1 ప్రాంతంలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద ఏర్పాటు చేస్తోంది.
మేడిపల్లి ఓపెన్ కాస్ట్ నుంచి పూర్తిస్థాయిలో బొ గ్గును వెలికితీయంతో.. అక్కడ సుమారు 157 మీటర్ల లోతుతో విశాలమైన చెరువులా ఏర్పడింది. ఈ చెరువు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ఈ నీరు ఏడాదం తా అందుబాటులో ఉంటుంది. ఈ నేప థ్యంలోనే మేడిపల్లి ఓసీ చెరువుకు ఎగువన 2350 మీటర్ల పొడవుతో.. 23 మీటర్ల లోతు తో మరో చెరువును తవ్వి.. అందులోని నీటిని దిగువకు (మేడిపల్లి ఓసీ) విడుదల చేయడం ద్వారా జల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది ఆలోచన.
బ్లాక్ లిస్ట్ చేయాల్సిన వ్యాప్కోస్‌పై..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేసింది వ్యాప్కోస్ సంస్థే. అలాం టి డీపీఆర్ ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం చేశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ఇతర బ్యారేజీల్లోనూ తలెత్తిన సమస్యలకు వ్యాప్కోస్ ఇచ్చిన డీపీఆరే కార ణం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం వెనుక వ్యాప్కోస్ ఇచ్చిన లోపభూయిష్టమైన డీపీఆర్‌కూడా ఒక కారణమనే నిపుణులు చెబుతు న్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. అంతే కాకుండా.. సర్వే ను తూతూ మంత్రంగా చేసి.. ఇలాంటి సాం కేతికంగా, నిర్మాణ పరంగా లోపాలతో డీపీఆర్‌ను ఇచ్చిన వ్యాప్కోస్‌ను దేశ వ్యాప్తంగా నిషేధించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రా యాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం కుంగు బా టుకు వ్యాప్కోస్ ఇచ్చిన డీపీఆర్ కూడా ఒక కారణంగా పేర్కొంటూ.. కాళేశ్వరం కుంగుబాటు నేపథ్యంలో సదరు వ్యాప్కోస్ సం స్థపై జరిమానా వేయాలంటూ పలువురు సూచిస్తున్నారు.
నాలుగు కాలాలు నిలుస్తుందా?
కాళేశ్వరం బ్యారేజీ కుంగుబాటుకు, ఇరతరత్రా బయటపడ్డ లోపాలకు వ్యాప్కోస్ త యారుచేసిన డీపీఆర్ కూడా ఒక కారణమనేది అందరూ ఒప్పుకునేదే. తూతూ మం త్రంగా సర్వే చేసి, సాంకేతికాంశాలను లోతు గా అధ్యయనం చేయకుండా, లోపాల పుట్ట గా, తప్పుల తడకగా, వ్యయ అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచి ఇచ్చిన డీపీఆర్ వల్ల.. రూ. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అటకెక్కింది.
వాస్తవానికి వ్యాప్కోస్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, ఆ సంస్థపై జరిమానా విధిం చాలి. వ్యాప్కోస్ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి జైలుకు పంపించాల్సిన తరుణంలో.. కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ ఏజన్సీ అనే నెపంతో.. సింగరేణి సంస్థ ఇప్పుడు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు కూడా డీపీఆర్ తయారు చేయాలనే కాంట్రాక్టును అప్పగించడం చూస్తుంటే అంతర్గ తం గా ఏదో మతలబు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసినట్టుగానే తూతూమంత్రంగా సర్వే చేసి, లోపభూయిష్టంగా, అడ్డదిడ్డంగా డీపీఆర్‌ను సిద్ధంచేసి ఇస్తే.. సింగరేణి చేపట్టిన పం ప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకూడా 40 ఏండ్లు కాదుకదా.. నాలుగేండ్లునా నిలుస్తుందా అని నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
హైడల్ పవర్ ప్రాజెక్టుకు అధ్యయనం ఇలా..
ఏకపక్షంగా వ్యాప్కోస్‌కు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు డీపీఆర్ కాంట్రాక్టును అప్పగించడంతో.. ఈ ఒప్పందం ప్రకారం ఈ హైడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సాంకేతిక పరీక్షలు నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాప్కోస్ చేసే అధ్యయనంలో.. జీయోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రాలజీ స్టడీ చేయాల్సి ఉంటుంది.
అలాగే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిజైన్లు, పర్యావరణ అంశాలు, భద్రతా పనులు తదితర అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. దీనితోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వడానికి పట్టే సమయం, ఉత్పత్తి అయిన విద్యుత్తును ఏ ధరకు అమ్మాలి. అనే అనేక కీలక విషయాలను డీపీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. రూ. 3 వేల కోట్ల అంచనా వ్యయంతో.. 40 సంవత్సరాల పాటు తక్కువ ధరకే జల విద్యుత్తును అందించేలా ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
కాళేశ్వరం డీపీఆర్ మాదిరిగానేనా?
ఇంత జరిగిన తరువాత కూడా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ డీపీఆర్ తయారుచేసే బాధ్యతలను వ్యాప్కోస్‌కు.. అదీ.. నామినేషన్ పద్ధతిలో అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో.. ఇలాగే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 20 నుంచి 30 శాతం రేట్లు పెంచి డీపీఆర్ తయారు చేశారు. స్పెసిఫికేషన్స్, క్యాలిఫికేషన్స్ కొందరు కావాల్సిన కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయించారు.
అలాంటి వ్యాప్కోస్‌ను ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. అంటే కాళేశ్వరం డీపీఆర్ విషయంలో జరిగినట్టుగానే ఇక్కడకూడా జరుగుతుందా అని అనుమానిస్తున్నారు. ఇక్కడకూడా అంచనాలు పెంచి, స్పెసిఫికేషన్స్, క్వాలిఫికేషన్స్‌ను కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా తయారుచేస్తారా అనే అనుమానాలు బలంగా వినపడుతున్నాయి.
ఇదే జరిగితే సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం కలగడం ఖాయంగా కనపడుతోంది. అలా కాకుండా ఉండాలంటే.. వ్యాప్కోస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. అనుభవం ఉన్న సంస్థలకు టెండర్లు పిలిచి పారదర్శకత ఉండేలా డీపీఆర్ తయారీ బాధ్యతలను అప్పజెప్పాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
డీపీఆర్‌పై అనుమానాలు..
వాస్తవానికి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అనేది కొత్త అంశం. ఇప్పటి వరకు దీనిపై అధ్యయనం చేసిన సంస్థలు చాలా తక్కువ. రూ.3000 కోట్లతో రాష్ట్రంలో మొదటిసారిగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ విషయంలో అనుభవం ఉన్న వారికి డీపీఆర్ రూపొందించే బాధ్యత అప్పజెప్పాలి. కానీ సింగరేణి.. వ్యాప్కోస్ వైపే మొగ్గుచూపింది. వ్యాప్కోస్‌కు ఈ రంగంలో అనుభవం లేదు.
అయినా రూ.7 కోట్లకు డీపీఆర్ తయారీ బాధ్యతను అప్పజెప్పడం వెనుక ఏదో ఉందనే చర్చకు దారితీస్తోంది. పైగా ఇప్పటికే వ్యాప్కోస్ డీపీఆర్ తయారుచేసి నట్టుగా నిర్మించిన కాళేశ్వరంలో మేడిగడ్డ బరాజ్ కుంగింది. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లలోలోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్‌కు వ్యాప్కోస్ ఇచ్చే డీపీఆర్‌పై అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.