ఇండ్లను ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు..
ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తుంగలోకి తొక్కి జీహెచ్‌ఎంసీ అధికారులు తమ ఇండ్లను ఖాళీ చేయాలని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, అంజయ్య నగర్ బాధితులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు అస్మా బేగం, రమావత్ పద్మ, రేష్మా బేగం, జంగీర్ లతో కలసి అంజయ్య నగర్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ హుస్సేన్, మాట్లాడుతూ,అంజయ్య నగర్ లోని సర్వే నంబర్ 135 లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 70 గజాల చొప్పున10 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.
ఇక్కడే గత 30 ఏళ్లుగా నివసిస్తున్నామని వివరించారు. గత నెలలో జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులతో వచ్చి మీరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇష్టరీతిన చెప్పలేని విధంగా అనరాని మాటలు మాట్లాడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం హై కోర్ట్ ను ఆశ్రయించగా కోర్ట్ స్టే ఇవ్వడం జరిగిందని చెప్పారు. కాగా కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్న జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
తమకు డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కేటాయిస్తే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ లను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.






