9 August, 2026 | 1:34 AM

భర్తపై అనుమానంతో మహిళ ఆత్మహత్య

09-08-2026 12:00 AM

కూకట్ పల్లి, ఆగస్టు 8,( విజయ క్రాంతి): తన భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడని అనుమానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి సుమిత్రానగర్ లో శనివారం చోటుచేసుకుంది. బాలానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన దొమ్మాట మల్లేశం ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తూ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి సుమిత్రానగర్ లో భార్య నవనీత, తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

మల్లేశం నవనీత దంపతులకు క్రిసివ్ ఏడు నెలల కుమారుడు గలడు. మల్లేశం తరచుగా మద్యం సేవిస్తుంటాడు, వేరొక మహిళతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని నవనీత తన భర్తను అనుమానిస్తుండేది. ఇదే క్రమంలో భార్య నవనీత వద్దంటున్నా మల్లేశం తన స్నేహితులతో కలిసి శనివారం చీరాల వెళ్ళాడు.

శనివారం ఉదయం 8 గంటల సమయంలో నవనీత తన కుమారుడిని అత్తకు అప్పగించి పక్క గదిలోకి వెళ్లి చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.