calender_icon.png 3 December, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల పథకాలలో అవినీతి బట్టబయలు

03-12-2025 06:22:59 PM

సూర్యాపేట శాఖపై గిద్దె రాజేష్ ఆగ్రహం..

2018 నుంచి జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయకపోతే సచివాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు రాజేష్ హెచ్చరిక..

చివ్వెంల: సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మండలం గుంపుల గ్రామంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు ఆధ్వర్యంలో నేతలు కళ్లకు నల్లగంతులు కట్టుకుని నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. సూర్యాపేట వికలాంగుల సంక్షేమ శాఖలో 2018 నుండి నేటివరకు ఎన్నో అవినీతి ఘటనలు జరిగినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. వికలాంగుల పరికరాల పంపిణీ, వికలాంగుల బ్యాంకు రుణాల ఎంపిక, వివాహ ప్రోత్సాహ బహుమతుల మంజూరు, త్రీ వీలర్ మోటార్ వెహికల్‌ల ఎంపిక అన్ని చోట్లా లంచాలు తీసుకొని అర్హులైన వికలాంగులను పక్కనపెట్టినట్లు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ముడుపులు చెల్లించినవారికి ప్రాధాన్యత ఇచ్చి, నిజంగా అర్హులైన వికలాంగులకు తీవ్రమైన అన్యాయం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2018 నుండి జరిగిన వాహనాల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ జరపకపోతే త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి, విచారణ జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తానని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, మండల సీనియర్ నాయకులు కొల్లూరి నాగరాజు, ఆవుల వెంకటలక్ష్మి, కీసర సక్కుబాయమ్మ తదితరులు పాల్గొన్నారు.