03-12-2025 06:23:24 PM
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించారు. రూ.262.68 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారని, దీంతో తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తించారు. కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని, దేశంలో అత్యధికంగా వరిని పడించేది తెలంగాణ రాష్ట్రమేనని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. రాష్ట్రంలో రైతులపై రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టామని, వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు.
3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నామని అని వెల్లడించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో మొదలు పెట్టిన ప్రాజెక్టులన్ని పూర్తయ్యాయని, కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామని, హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వివరించారు.