13 April, 2026 | 1:28 AM

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

13-04-2026 12:10 AM

ప్రైవేటులో తగ్గిన ఉత్తీర్ణత.

ప్రభుత్వ, కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో మెరుగైన ఫలితాలు

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో బాలికలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సులలో బాలికల ఉత్తీర్ణత శాతం బాలురతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ, కేజీబీవీ, గురుకుల కళాశాలల విద్యార్థులోనూ మెరుగైన ఫలితాలు సాధించగా, ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,982 మంది ఉత్తీర్ణత సాధించి 66.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 1,649 మంది పరీక్షలకు హాజరుకాగా 830 మంది పాస్ అయి 50.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలలో 2,851 మంది హాజరై 2,152 మంది ఉత్తీర్ణత సాధించి 75.48 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 5,353 మంది విద్యార్థుల్లో 2,987 మంది ఉత్తీర్ణత సాధించి 55.80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 38.41 కాగా, బాలికలు 66.52 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇక ఒకేషనల్ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,372 మంది విద్యార్థుల్లో 938 మంది ఉత్తీర్ణత సాధించి 68.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలుర ఉత్తీర్ణత శాతం 52.90 కాగా, బాలికలు 85.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,536 మంది విద్యార్థుల్లో 870 మంది ఉత్తీర్ణత సాధించి 56.64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 34.67 కాగా, బాలికలు 76.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కేజీబీవీ విద్యార్థినుల ఘన విజయం. 

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. జిల్లాలోని 11 కేజీబీవీలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 509 మంది విద్యార్థినులు హాజరుకాగా, వీరిలో 438 మంది ఉత్తీర్ణత సాధించి 86 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ ఫలితాల్లో 85 మందికి పైగా విద్యార్థినులు 900కు పైగా మార్కులు సాధించడం విశేషం. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని 20 కేజీబీవీల్లో 1,024 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా, 792 మంది ఉత్తీర్ణత సాధించి 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

ఈ ఫలితాల్లో 150 మందికి పైగా విద్యార్థినులు 400కు పైగా మార్కులు సాధించారు. ప్రైవేటు కళాశాలలో మాత్రం తక్కువ సంఖ్యలో మెరుగైన ఫలితాలు సాధించగా ఎక్కువ శాతం విద్యార్థులు ఆయా సబ్జెక్టుల వారిగా ఫెయిలయ్యారు. అడ్డగోలుగా ఫీజులు తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత శాతం పొందలేకపోయారు.