ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
l ఫస్టియర్ 60.01 శాతం, ద్వితీయలో 64.19 శాతం ఉత్తీర్ణత
l ఫస్టియర్‌లో రంగారెడ్డి, సెకండియర్‌లో ములుగు టాప్
l మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు
l నేటి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలదే హవా కొనసాగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,81,003 మంది విద్యార్థులు హాజరయ్యారు.
మొదటి సంవత్సరంలో 4,78,723 మంది విద్యార్థులకు గానూ 2,87,261 (60.01 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 68.35 శాతం అమ్మాయిలు, 51.50 శాతంతో అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5,02,280 మంది విద్యార్థులకు 3,22,432 (64.19 శాతం) మంది పాసయ్యారు. సెకండియర్‌లో 72.53 శాతంతో అమ్మాయిలు పైచేయి సాధించగా, అబ్బాయిలు 56.10 శాతంతో ఉత్తీర్ణులు అయ్యారు.
ఫస్టియర్‌లో 71.7 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో నిలవగా, 34.81 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 82.95 శాతంతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో, 44.29 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ విద్యలో ఫస్టియర్‌లో నారాయణపేట్ జిల్లా 72.96 శాతంతో ప్రథమ స్థానంలో నిలిస్తే, సూర్యాపేట జిల్లా 39.9 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 80.44 శాతంతో నారాయణపేట మొదటి స్థానంలో, 52.48 శాతంతో నిజామాబాద్ జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయి.
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తులను గురువారం నుంచి మే 2 వరకు స్వీకరించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించను న్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్ మాత్రం జూన్ 10 ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 11న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 12న నిర్వహిస్తారు.
నేటి నుంచి రీకౌంటింగ్
గురువారం నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించి రీకౌంటింగ్ చేసుకోవచ్చని, రూ.600 చెల్లించి రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు.
ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్‌జిల్లా తాండూరు మండలం అచలపూర్‌కు చెందిన మైధం సాత్విక్ (18) ఇంటర్‌లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెలో ఇంటర్ విద్యార్థిని తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లాకు చెందిన రమ్య అనే విద్యార్థిని శేరిపల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
ఫస్టియర్‌లో టాప్ 5 జిల్లాలు..
జిల్లా హాజరైనవారు పాసైనవారు ఉత్తీర్ణతశాతం
రంగారెడ్డి 71,297 51,121 71.7
మేడ్చల్ 64,828 46,407 71.58
ములుగు 1,717 1,202 70.01
ఖమ్మం 16,015 10,224 63.84
కరీంనగర్ 15,058 9,548 63.41
సెకండియర్‌లో టాప్ 5 జిల్లాలు
జిల్లా హాజరైనవారు పాసైనవారు ఉత్తీర్ణతశాతం
ములుగు 1,695 1,406 82.95
మేడ్చల్ 58,933 46,742 79.31
రంగారెడ్డి 64,759 50,273 77.63
కరీంనగర్ 13,407 9,974 74.39
ఖమ్మం 14,564 10,806 74.2






