9 May, 2026 | 9:50 AM

రికార్డులు కావాలి

25-04-2024 02:40 AM

‘కాళేశ్వరం’ కమిటీ 

l అధికారులకు జస్టిస్ పీసీఘోష్ కమిటీ ఆదేశం

l అవసరమైతే పబ్లిక్ నోటీసిచ్చి సమాచార సేకరణ

l బీఆర్‌కే భవన్‌లో అధికారులతో సమావేశం

l 26 వరకు కొనసాగనున్న విచారణ

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ ఏక సభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్ ఘోష్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుల శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కమిటీకి అందించినట్టు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు కావాలని, ఎలాంటి రికార్డులు కావాలో అధికారులకు స్పష్టంగా సూచించినట్టు తెలిసింది. విచారణ కొనసాగేందుకు సరైన సమాచారం ఎక్కడ ఉన్నా కమిటీ దృష్టికి రావాలంటే పబ్లిక్ నోటీసు లాంటిది ఇవ్వాల్సి ఉంటుందని కూడా సూచించారు. దీనివల్ల ప్రజలు, సంస్థల వద్ద కాళేశ్వరానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కమిటీకి నివేదించవచ్చని అన్నారు. తప్పుడు సమాచారం అందించకుండా, ఆరోపణలు చేయకుండా ఉండేలా సమాచారం అందించేవారు తప్పనిసరిగా అఫిడవిట్ కూడా దాఖలు చేసే విధంగా నిబంధన విధించడంపైకూడా కమిటీ చర్చించినట్టు తెలుస్తుంది. అవసరం అనుకుంటేనే ఇలాంటి పబ్లిక్ నోటీస్ ద్వారా సమాచారాన్ని కోరాల్సి వస్తుందని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం.

ముందుగా అధికారులే కావాల్సిన రికార్డులను కమిటీకి అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉండగా కమిటీకి కావాల్సిన సమాచారం అందించడం, అధికారులతో మాట్లాడటం, ఇతర కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసేందుకు వీలుగా నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన కమిటీ.. ఈ నెల 25, 26 తేదీల్లో బీఆర్‌కే భవన్‌లోని కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇంజినీరింగు ఉన్నతాధికారులతోనూ మాట్లాడే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ నెల 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ తిరిగి వెళ్తారు.