పంచకట్టు.. అచ్చ తెలుగు
- లోక్‌సభలో ఆకట్టుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ సోమవారం పార్లమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్‌సభలో వారు తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మాతృభాషపై వారికున్న మమకారాన్ని చాటుకున్నారు. బొగ్గు, గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి సంప్రదాయ పంచెకట్టులో పార్లమెంటుకు వచ్చారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.
ఇరువురు రెండోసారి పార్లమెంటుకు ఎంపికయ్యారు. కిషన్‌రెడ్డి గత పార్లమెంటులో నూ కేంద్ర మంత్రిగా పనిచేయగా, బండి సంజయ్‌కు తొలిసారిగా క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. ప్రధాని మోదీ మొదట ప్రమాణ స్వీకారం చేయగా ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులు, అనంతరం సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత ఎంపీలు, రాష్ట్రాల అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 280 మంది ఎంపీలు సోమవారం ప్రమాణం చేయగా మిగిలిన వారు నేడు చేయనున్నారు.






