సమయం ఇవ్వండి
- ‘తుమ్మిడిహెట్టి’పై చర్చకు తేదీ ఖరారు చేయాలి
- మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ
- బరాజ్ ఎత్తును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. బరాజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృం దంతో సమావేశానికి సమయం కేటాయించాలని, అందుకు తేదీని ఖరారు చేయాలని విజ్ఞ ప్తి చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మా ణం ప్రాణహిత ప్రాజెక్టులో అత్యంత కీలక భాగంగా ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మ డి రాష్ట్రంలో రూపొందించిన తొలి ప్రణాళిక ప్రకారం ఈ బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు.
అనంతరం రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల తర్వాత 2016 ఆగస్టు 23న ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ తో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అనుమతులు, సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమ లు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో తుమ్మిడిహెట్టి అంశాన్ని మళ్లీ సమీక్షించింది. ఈ సందర్భంగా నిపుణుల అభి ప్రాయాలను పరిశీలించిన ప్రభుత్వం.. 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ ఉత్త ర తెలంగాణ భవిష్యత్ నీటి అవసరాలకు సరిపోదన్న అంచనాకు వచ్చింది.
ముంపు ప్రభావం పరిమితంగానే..
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో బరాజ్ ఎత్తు అంశా న్ని మరోసారి పునర్ పరిశీలించాలని సీఎం తన లేఖలో వివరించారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిశీలించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పరిమితంగానే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రా యపడుతోంది. అదే సమయంలో ఎఫ్‌ఆర్‌ఎల్ పెంపుతో గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తరలించే అవకాశం కలుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.
దీని వల్ల పంపింగ్ అవసరం భారీగా తగ్గి విద్యుత్ ఖర్చు లు కూడా తగ్గే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ప్రాణహిత ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న నేపథ్యంలో తుమ్మిడిహెట్టి అంశం మరోసారి రాజకీయ, పరిపాల నా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






