28 May, 2026 | 1:56 AM

మెడికల్ బోర్డు ఫలితాలపై నోరు విప్పాలి

28-05-2026 12:17 AM

సీఐటీయూ జనరల్ సెక్రెటరీ తుమ్మల రాజారెడ్డి

మంచిర్యాల, మే 27 (విజయక్రాంతి) : మెడికల్ బోర్డు ఫలితాలపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు నోరు విప్పాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఫిట్ సెక్రటరీ తోడే సుధాకర్ అధ్యక్షతన శ్రీరాంపూర్ - 1 గనిపై కార్మికులను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నారని గొప్పలు చెప్పిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు మెడికల్ బోర్డు రిజల్ట్ ఏమైందో చెప్పాలని, సింగరేణి వ్బుసైట్ నుంచీ మెడికల్ బోర్డు రిజల్ట్ ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు.

ఒప్పందం ప్రకారం నిర్వహించాల్సిన కారుణ్య నియామకాల మెడికల్ బోర్డు నిర్వహించకుండా యాజమాన్యంకు విన్నతులు ఇస్తూ గుర్తింపు సంఘం మరోవైపు ప్రాతినిధ్య సంఘం తమ అనుబంధ ప్రజా ప్రతినిధులను కలుస్తూ ఫోటోలు దిగి పెడుతూ కాలం గడపడమే తప్ప కార్మిక సమస్యలు పరిష్కరించింది లేదని, సమ్మె నోటీసుకు వస్తామని ప్రతిపక్ష సంఘాలను కార్మికులను మభ్యపెడుతూ మోసం చేసిన ఘనత యాజమాన్య సర్కార్ సంఘాలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చివరకు కార్మికులు పనిచేయడానికి అవసరమైన డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు, సిమెంట్ క్యాప్సూల్స్, కీలలు, బోల్టర్ రాడ్ తో పాటు గత కొన్ని నెలలుగా టోపీలు కూడా సప్లై చేయకుండా సరైన పనిముట్లు ఇవ్వకున్నా యాజమాన్యాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్న గెలిచిన సంఘాలు కార్మికులకు ఒరగబెట్టింది ఏమున్నదని ప్రశ్నించారు. 

ఇప్పటికైనా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు తమ సొంత పైరవీలను పక్కకు పెట్టి కార్మిక సమస్యలను సాధించాలని పట్టుదలతో ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు నరేడ్ల వెంకటరెడ్డి బాలకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.