మాకు రావాల్సిన జీతాలు ఇప్పించండి
మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి): ఏజెన్సీ పేరిట పని చేయించుకుని వేతనాలు చెల్లించకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 ఉద్యోగులు, కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్, స్వీపర్, పీఈటీ, ఇంగ్లీష్ టీచర్‌గా గత ఏడాది అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 సంస్థ ద్వారా విధులు నిర్వహిస్తున్న వారికి 8 నెలల గడిచినప్పటికీ సంస్థ నిర్వాహకులు మాత్రం వేతనాలు చెల్లించలేదన్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీటీడీవో, డీఈవో, గిరిజన ఐటీడీఏ ఉట్నూర్ పిఓకు వేరువేరుగా వినతి పత్రాలు ఇచ్చామని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో శాతరాజు స్వాతి, గంట నరేష్, అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 ఉద్యోగ, కార్మికులు, సీ ఐ టీ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, స్వరూప, సాయిరాణి, రాజేశ్వరి, ప్రశాంతి, రమ్య, సువర్ణ, ప్రణిత తదితరులు పాల్గొన్నారు.






