23 April, 2026 | 12:27 AM

ఖమ్మంలో ‘గ్లాసు’ తుపాను!l

10-05-2024 12:30 AM

స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు

జనసేన శ్రేణుల్లో అయోమయం

బీజేపీ అభ్యర్థిలో ఆందోళన

ఖమ్మం, మే 9 (విజయక్రాంతి): ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కలకలం రేపుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును స్వతంత్ర అభ్యర్థి వాసం రామకృష్ణ దొరకు ఎన్నికల అధికారులు కేటాయించడంతో జనసేన, బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు జనసేన, టీడీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఖమ్మంలో ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసైనికులు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళన చెందుతోంది. జనసేన ఎన్నికల గుర్తుపై పలు వివాదాలు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. అయితే, అక్కడ గాజుగ్లాసు గుర్తు జనసేన తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు మాత్రమే కామన్ సింబల్‌గా ప్రకటించింది. మరొకరికి కేటాయించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఇందుకోసం జనసేన పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. స్వతంత్య్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన ఏపీలో హైకోర్టును ఆశ్రయించింది. గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతిపత్రాలు ఇచ్చారు. 

తెలంగాణలో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు 

తెలంగాణలో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు తెలిపాయి. ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడి ఎన్నికల ప్రచారంలో జనసైనికులు పాల్గొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి బీజేపీలో ఎన్నికల పొత్తు సాగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీకే ఎక్కువ స్థానాలు కేటాయించింది. ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గా ల్లో  గాజుగ్లాసు గుర్తుపైనే జనసేన పోటీచేసింది. జనసేనకు ఇక్కడ 11 వేల ఓట్లు దక్కా యి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి మిర్యాల రామకృష్ణకు 4,040 ఓట్లు, వైరా నియోజకవర్గంలో 2,712 ఓట్లు, అశ్వారావుపేట నియోజకర్గంలో 2,281 ఓట్లు దక్కాయి. ఇలా ఇక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో మెన్ననే జనసేన తరఫున పలుచోట్ల గాజుగుర్తు జనాల్లోకి వెళ్లింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గాజు గుర్తు అంటేనే జనసేన పార్టీ గుర్తుకు వస్తదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రలో ఒకవిధంగా తెలంగా ణాలో మరో విధంగా ఎన్నికల విధానాలు ఎలా రూపొందిస్తుందని జనసైనికలు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మంలో స్వతంత్ర అభ్యర్థికి జనసేనకు చెందిన గాజుగ్లాసు గుర్తు కేటాయించడం పట్ల  కార్యకర్తలు అయోమయా నికి గురవుతారని చెప్తున్నారు.  

ఎవరీ రామకృష్ణ దొర?

ఆదివాసీ అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జేఏసీ బలపర్చిన వాసం రామకృష్ణ దొరను ఖమ్మం అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఆదివాసీ అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆషామాషీ సంఘం కాదంటున్నారు గిరిజన కోయ ఆదివాసీలు. అలాంటి స్వతం త్య్ర అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. కొత్తగూడెం కేంద్రంగా గత కొన్నేళ్లు గా భూ సమస్యలపై పోరాటాలు చేస్తున్న గిరిజన నాయకుడు వాసం రామకృష్ణ్ణదొ ర. తుడుందెబ్బ వంటి ప్రజా సంఘాల్లో, పలు ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలపై గళమెత్తి పోరాడిన నాయకుడీయన. మెన్నీ మధ్య వైఎస్సార్టీపీ షర్మిల పార్టీ తరఫున సీటు ఆశించి షర్మిలతో కొంతకాలం కొనసాగాడు. ఎట్టకేలకు జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ బలపర్చడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దిగాడు. ఈయనకు బ్యాలెట్ యూనిట్‌పై 30వ సీరియల్ నంబరుపై గాజుగ్లాసు గుర్తును కేటాయించారు.

వాస్తవానికి కోయ ఆదివాసీలకు ఒక టికెట్ కేటాయించాలని ఆదివాసీలు అన్ని ప్రధాన పార్టీలను అభ్యర్థించాయి. గతంలోనూ లంబాడాలకే కేటాయించారని, ఈ సారైనా  ఒక సీటు కోయ ఆదివాసీ అభ్యర్థికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి గిరిజన ఆదివాసీలు ఏదో ఒక రిజర్వుడ్ స్థానాన్ని గట్టిగా కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో, ఆదివాసీలంతా ఏకమై వారి సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి రాజకీయ జేఏసీగా  ఏర్పడ్డారు. మహబూబాబాద్‌తోపాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో స్వతంత్రంగా అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆదీవాసీల జేఏసీ అభ్యర్థి వాసం రామకృష్ణను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించి ఆయనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడమే ఇక్కడ ట్విస్ట్. తెలంగాణాలో జనసేన పోటీ చేయనిచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తు  ఫ్రీ సింబల్ గా కేటాయించారు. అయితో జనసేన ప్రస్తుతం ఎన్నికల బరిలో లేదు కానీ, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతు పలుకుతూ బీజేపీ కూటమిలో ఉండటం గమనార్హం.