ఆర్టీసీ సమ్మె బీఆర్‌ఎస్ కుట్ర!
- హరీశ్‌రావే కార్మికులను రెచ్చగొట్టారు
- ఇప్పుడే వస్తామని వెళ్లి జేఏసీ నేతలు తిరిగి రాలేదు
- మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె బీఆర్‌ఎస్ నాయకుల కుట్ర అని ఆరోపించారు. ఇప్పుడే వస్తామని వెళ్లి జేఏసీ నేతలు తిరిగి రాలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ రావు ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రాక్షసానందం పొందేందుకు ఎంతటికైనా దిగజారుతామనుకుంటే అది వారి ఖర్మ అన్నారు.
ఇటీవల జగిత్యాల బీఆర్‌ఎస్ సభలో మహాలక్ష్మీ ప్రయాణాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో ఓ ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావు సమ్మెపై కార్మికులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ సమ్మెతో రాక్షసానందం పొంది, మహిళా ప్రయాణికులను ఇబ్బంది కలగజేయొద్దన్నారు. మహాలక్ష్మీపథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు.
సకల జనుల సమ్మె బీఆర్‌ఎస్ కోసం చేసింది కాదని తెలంగాణ కోసం చేసిందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో పొన్నం ప్రభాకర్ మాటాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీతోని ఏర్పాటు చేసి జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించామన్నారు. నాలుగు గంటలపాటు విన్న నేతలు ఇప్పుడే వస్తామని మీటింగ్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సమ్మెకు పిలుపు ఇచ్చారన్నారు.
ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పారని.. అయినా వినకుండానే ఎవరితో ఫోన్‌లో మాట్లాడి సమ్మెకి వెళ్లారన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేయదగినవేనని, వీటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు నిరసన తెలపవచ్చు కానీ, మిగతా వారు విధుల్లో చేరాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని, కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేసి నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామన్నారు.
చర్చలకు ప్రభుత్వం ఆహ్వానిస్తున్నదని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ సంఘాల పేరు మీద మేం ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని, రోజుకూ 65 లక్షల మంది రోజూవారి పనుల కోసం ప్రయాణం చేస్తున్నారని అన్నారు.
కొన్ని సమస్యలు పరిష్కరించాం...
ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ రూ.280 కోట్లు ఇచ్చామని,1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోబడే చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్లు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాము శ్రమ దోపిడి చేయదలచుకోలేదని, ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి రూ. 300 కోట్ల, అవసరమైనప్పుడు రూ.400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుందన్నారు.
ఆర్టీసీలో సర్వీసు నుంచి రిమూవ్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్రలు చేయొద్దని కోరారు. నాయకత్వం వహించిన వారిలో రిటైర్డ్ అయిన వారు, ఉద్యోగాలు చేయని వారే ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండా అప్పటి ఎండీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఆదరాబాదరగా విలీనం అంశాన్ని తెచ్చారన్నారు. తనతో చర్చించేందుకు ఇబ్బంది ఉంటే ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడొచ్చన్నారు.
డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం యూనియన్‌లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదని, ఈవీ బస్సులు 2018లో స్టార్ట్ అయ్యాయి.. అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అన్నారు. దేశ వ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణకి 2 వేల బస్సులు ఇస్తున్నారన్నారు.
కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు తీసుకొస్తున్నామన్నారు.తాము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశామని, 2017 పీఆర్సీ ఇచ్చామని, తెలంగాణ అక్కా చెల్లెళ్లులు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు.






