కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
- గత ప్రభుత్వం చేసిన తప్పులే రేవంత్ సర్కార్ చేస్తుంది
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ఉప్పల్ బస్ డిపో ఎదుట కార్మికులతో టీఆర్పీ అధ్యక్షుడు ధర్నా
మేడిపల్లి, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బుధవారం ఉప్పల్ డిపో ముందు కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు ఎమ్మెల్సీ, టీఆర్పీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మద్దతు ప్రకటించారు.బుధవారం తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బస్సు డిపోలకే పరిమితమయ్యాయి.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని ఈ సందర్భంగా మల్లన్న హెచ్చరిం చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే రేవంత్ సర్కార్ చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ సర్కార్‌కి పడుతుందన్నారు.
అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్‌లో ప్రమాదం జరిగిందని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని మండిపడ్డారు.ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా, కార్మికుల కష్టానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నరని, అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం ఎంత ప్రమాదకరమో అనుభవం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడపడం అంతే ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మల్లన్న డిమాండ్ చేశారు.సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కార్మికులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలతో పరిస్థితిని మరింత విషమం చేస్తున్నారని వెంటనే కార్మికులతో చర్యలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని మల్లన్న స్పష్టం చేశారు.కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతానని హామీ ఇచ్చిన ఆయన, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ప్రభుత్వం తక్షణమే చర్చలకు ముందుకు వచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మల్లన్నను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు మర్యాద పూర్వకంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను వివరించి, కొనసాగుతున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని మల్లన్నని కోరారు.
అలాగే కార్మికుల తరఫున పెట్టిన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.తీన్మార్ మల్లన్న స్పందిస్తూ ఆర్టసీ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికుల హక్కులు, వేతన సవరణలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికుల 32 ప్రధాన డిమాండ్లు
ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, ఆర్థిక సమస్యలు పరిష్కరించి సంస్థను బలోపేతం చేసి, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి,2017 నుంచి పెండింగ్‌లో ఉన్న భత్యాలు, బకాయిలు (రిటైర్డ్ సిబ్బందితో సహా) చెల్లించాలి, 2021 వేతన సవరణను 30% ఫిట్‌మెంట్‌తో అమలు చేసి, 2025లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానత్వం కల్పించాలి,కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను ఆధునికీకరించాలి, సంస్థపై ఉన్న రుణభారం ప్రభుత్వం భరించి, బడ్జెట్‌లో కనీసం 3% నిధులు కేటాయించాలి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి కొత్త డిపోలు ఏర్పాటు చేయాలి, ఆర్టీసీ భూములను ప్రైవేట్ ఈవీ ఆపరేటర్లకు అప్పగించకూడదు, సీసీఎస్, ఎస్‌ఆర్‌బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
సీసీఎస్ ఎన్నికలను నిర్వహించాలి, మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని స్మార్ట్ కార్డుల ద్వారా అమలు చేయాలి, ప్రయాణికుల కోసం బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచాలి, ప్రతి నెల రూ.400 కోట్ల బకాయిలు కోతలు లేకుండా చెల్లించాలి, 2,500 కోట్ల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలి,డిపెండెంట్స్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, ఉద్యోగాల వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి, అన్ని విభాగాల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి,అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి,21 రోజుల అటెండెన్స్ ఇన్సెంటివ్ అమలు చేయాలి,
వర్క్‌షాపులు, ప్రొడక్షన్ యూనిట్లను బలోపేతం చేయాలి,తార్నాక ఆసుపత్రిలో శాశ్వత సిబ్బందిని నియమించాలి,రోగులు, వారి కుటుంబాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగులకు మెడికల్ సదుపాయాలు విస్తరించి, తల్లిదండ్రులకు కూడా వర్తింపజేయాలి, తగిన మందులు అందుబాటులో ఉంచి, పరీక్షల ఖర్చులను భరించాలి,రిటైర్మెంట్ రోజునే అన్ని బకాయిలు చెల్లించే విధానం అమలు చేయాలి, అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలి, రిటైర్డ్ అవుట్‌సోర్స్ అధికారులను తొలగించి, ప్రమోషన్ల ద్వారా పోస్టులను భర్తీ చేయాలి,
డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ అవుట్సోర్సింగ్ను పూర్తిగా నిలిపివేయాలి, రిటైర్మెంట్‌కు ముందు 300 రోజులు మించిన ఎరన్డ్ లీవ్ వినియోగానికి అనుమతి ఇవ్వాలి,అన్ని యూనిట్లలో తాగునీరు, పార్కింగ్ షెడ్లు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి, పాత నిబంధనలను సవరించి ఉద్యోగ భద్రతను బలోపేతం చేయాలి,అన్యాయంగా సస్పెండ్ లేదా తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.






