16 March, 2026 | 4:05 AM

జీవన చిత్రాలు.. మన కళారూపాలు

17-03-2026 12:00 AM

తెలంగాణ నేల సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడి జానపద, సాంస్కృతిక వారసత్వం అత్యంత ప్రాచీనమైనది, విశిష్టమైనది. శ్రమజీవుల చెమట చుక్కల నుంచి, పల్లె ప్రజల గుండె లయల నుంచి పుట్టిన కళారూపాలు ఈ గడ్డపై వెల్లివిరిశాయి. కాలం మారుతున్నా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా, ఆధునికతను అద్దుకుంటూ తెలంగాణ కళా క్షేత్రం విరాజిల్లుతోంది.

ఇక్కడి ప్రతి పాట ఒక పోరాటం, ప్రతి ఆట ఒక చైతన్యం. ప్రపంచ యవనికపై తెలంగాణ సాంస్కృతిక వైభవం నేడు సగర్వంగా నిలుస్తోంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం రాజపోషణతో పాటు సామాన్యుల దైనందిన జీవితం నుంచి ఉద్భవించింది. కాకతీయుల కాలంలో పెరిని శివతాండవం వంటి శాస్త్రీయ కళారూపాలు వికసించాయి. దీనిని యోధుల నృత్యంగా పిలిచేవారు.

సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ధైర్యం కోసం, భక్తితో ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. మరోవైపు సామాన్య ప్రజలు తమ అనుభవాల ఆధారంగా ప్రత్యేక కళా సంప్రదాయాలను సృష్టించుకున్నారు. గొల్లసుద్దులు, ఒగ్గు కథ, బుర్రకథ వంటివి పురాణ గాథలతో పాటు సామాజిక వాస్తవాలను చాటిచెప్పాయి. ఇవి వినోదంతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహనను, ఐక్యతను పెంపొందించే సాధనాలుగా నిలిచాయి.

దరువు.. ఒక చైతన్య వేదిక

తెలంగాణలో ఆధునిక ప్రజా సంస్కృతిని ప్రతిబింబించే మరో వేదిక దరువు జాతర. ఈ ఉత్సవం ద్వారా జానపద కళలు, ప్రజా పాటలకు కొత్త ఊపిరి పోస్తున్నారు. దరువు ఎల్లన్న, వరంగల్ రవన్న, దుర్గం భాస్కర్, విమలక్క, పృథ్వీరాజ్ వంటి కళాకారులు ఈ వేదిక ద్వారా సామాజిక చైతన్యాన్ని విస్తరిస్తున్నారు. జానపద గాయకులకు, సాంస్కృతిక కార్యకర్తలకు ఇదొక గొప్ప వేదికగా మారింది. ప్రజల ఆకాంక్షలు, సామాజిక సమస్యలు ఈ ప్రదర్శనల్లో ప్రధానాంశాలుగా ఉంటున్నాయి.

తెలంగాణలో కళలు సామాజిక ఉద్యమాలతో ఎంతగా పెనవేసుకుపోయాయో ఈ కార్యక్రమాలు నిరూపిస్తున్నాయి. తెలంగాణ జానపద సంగీతం నేటికీ సజీవంగా ప్రవహిస్తోంది. “రేలా రేలా రే” వంటి పాటలు గ్రామీణ, గిరిజన సంస్కృతికి అద్దం పడతాయి. ప్రకృతి సౌందర్యం, పల్లె జీవనం, సామూహిక ఆనందాన్ని ఈ పాటలు అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. మంగ్లీ, మధుప్రియ వంటి ఆధునిక గాయకులు ఈ సంప్రదాయాన్ని కొత్త తరానికి చేరువ చేస్తున్నారు. సరళమైన పదాలతో కూడిన పాటలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తున్నాయి.

ఆత్మగౌరవ ప్రతీక ధూంధాం

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూమ్ ధాం ఒక విప్లవంలా సాగింది. రసమయి బాలకిషన్ వంటి కళాకారుల సారథ్యంలో ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంది. పాటలు, నృత్యాలు, వ్యంగ్య నాటికల సమ్మేళనంగా ధూమ్ ధాం ప్రజలను ఉర్రూతలూగించింది. ప్రాంతీయ వివక్షను, అన్యాయాలను ఎండగట్టడంలో ఇది అస్త్రంగా పనిచేసింది. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ఈ ప్రదర్శనలు ప్రజలను భావోద్వేగంతో ఏకం చేశాయి.

నేటికీ ధూమ్ ధామ్ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ప్రతిఘటనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆధునిక తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో గద్దర్ ఒక ధ్రువతార. తన పాటలు, ప్రదర్శనల ద్వారా ఆయన జానపద కళలను పోరాట మాధ్యమంగా మలిచారు. జననాట్యమండలి వేదికగా బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి రూపాలను ప్రజల్లో కి తీసుకెళ్లారు. అణగారిన వర్గాల బాధలు, రైతుల కష్టాలు, దోపిడీపై నిరసన గద్దర్ పాటల్లో ప్రతిధ్వనించేవి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళారూపాలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ కళారూపాలు కాలంతో పాటు పరిణామం చెందుతూనే ఉన్నాయి. ఒగ్గు కథ, చిందు భాగవతం వంటి పురాతన కళల నుంచి నేటి ధూమ్ ధామ్ వరకు అన్నీ ప్రజల గొంతుకలే. సమాజ అవసరాలకు అనుగుణంగా కళలు మారుతూ జీవకళను నిలుపుకుంటున్నాయి. ఎందరో కళాకారుల త్యాగాలకు తెలంగాణ వేదికైంది. కళారూ పాలను కాపాడుకోవడం మన బాధ్యత. భావి తరాలకు ఈ వారసత్వాన్ని అందిం చడంతోనే మన సాంస్కృతిక పునాది బలంగా ఉంటుంది.

డా.ముచ్చుకోట సురేశ్‌బాబు