చైతన్యావర్తనం
కవిత్వం ఒక నిరంతర అన్వేషణమే. ఇది భవిష్యత్తు సృజన శీలురు ఆయా కాలాలలో ఒడిసి పట్టుకున్న రన్నింగ్ కామెంట్రీ. మానవ జీవన సంఘర్షణకు సాక్షి సంతకం. ఆ క్రమంలో ప్రబంధాలను సృష్టించిన ప్రాచీన కవి పం డిత యుగం, నవసృష్టి పట్ల మొగ్గు చూపిన ఆహ్లాద రస పిపాసుల భావ కవితా యుగం, సమాజ అభ్యుదయమే ఊపిరిగా ఆత్మా శ్రయ ధోరణి నుంచి ప్రజాశ్ర య కవితాసృష్టి చేసిన అభ్యుదయ యుగం, పద్యం కంటే వచనమే ప్రబలమనుకున్న వచన కవులు.... ఇదంతా 1965కు పూర్వం.
ఇలాంటి సమస్త గతాన్ని ఆగమ్య గోచరంగా భావించి ఛేదించాలని స్తబ్దత బద్దలు కొట్టాలని ఘాటుగా స్పందించిన దిగంబరకవులు 1965లో సాహితీ జగత్తులో రంగ ప్రవేశం చేశారు. అది షాకు ట్రీట్‌మెంట్ అని అరాచకవాదం అని, అల్లరి అని, లొల్లి అని కొందరు సాహిత్యకారులు అనుకున్నప్పటికీ అది ఒక స్తబ్దతను చేదించిన మాట నిజం అని మరికొందరన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు కవితా ప్రస్థానంలో మరో మలుపు, మేలుకొలుపు అని నలుగురు కవులు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్ కుమార, వే నరసింహారెడ్డి గారలు చేతనావర్త కవుల హృదయ ప్రకంపనగా కవిత్వాన్ని ప్రకటించారు.
దేశం, దేశ ప్రజల జీవన మార్గం భూమిక ఒకటే అయినా.. వారి అభివ్యక్తి, నిర్మాణ శక్తి, శిల్ప, వస్తు, భాషా ప్రయోగ మార్గం ఎవరిది వారిదేమైనా కాక వివిధ సామాజిక అన్యాయాలను, అవినీతిని, దుర్నీతిని వ్యతిరేకించే ప్రజాశ్రయ ప్రతిస్పందనగా చేతనావర్తం 1967లో మొదటి సంపుటి, 1970లో రెండవ సంపుటి, అనంతర కాలంలో 1992 ప్రాంతంలో రజతోత్సవ సంపుటిని వెలువరించి సాహిత్య అభిమానుల, విమర్శకుల దృష్టిని ఆకర్షించారు.
అనునిత్యం అంతర్, బహిర్, ఆధ్యాత్మిక, ఆధునిక సంఘర్షణతో సందర్శించే మానవ జీవితం సమగ్ర వికాసానికి సమన్వితమైన సాహిత్యం అనివార్యం. పాక్షిక దృష్టి ఏదైనా సహేతుకం కాదు. అది అభివృద్ధి నిరోధకం అని ఆ నలుగురు భావించారు. ఆ దృష్టితో భావిదర్శనం చేస్తున్నామన్నారు. సమగ్ర మానవ వికాస ధ్యేయంతో ఆ బాధ్యతతో చేతనావర్తం ఉద్యమ రూపమని విమర్శకుల ప్రశంసల జల్లులలో కూడా పులకరించింది.
ఇంతటి వైవిధ్య భరితమైన సాహిత్య సృజన జరుగుతున్న కాలంలో 90 సం వత్సరాల జీవితానుభవంతో జ్ఞానచక్షువులతో లోకాన్ని చూస్తూ.. కవులకు అప్పు డు ఇప్పుడు ఎప్పువు పాక్షిక దృష్టి కూడదన్న కవి పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో కొన్ని ముచ్చట్లు.
ప్రశ్న: చేతనావర్త కవుల్లో మీరు ఒకరు. చేతనావర్తం ఒక ఉద్యమంలా
వచ్చిందం టారు. ఎందుకు? నేపథ్యం ఏమిటి?
జవాబు: చేతనావర్తం అనే రచన ఒక సంపుటంగా రావటానికి రెండుమూడేండ్ల ముం దే చేశాను. మొదటి సంపుటంలో మొదటి ఏడెనిమిది గీతాలు ఆ రచనలోని భాగమే. అప్పుడా భాగాలు పత్రికల్లో వచ్చాయి. ఆ గేయాల స్పిరిట్ ఆధారంగా చేతనావర్తం సంపుటి రూపొందించబడింది. నా సహపాఠి పేర్వారం జగన్నాథం, మా చిన్నాయన సంపత్‌కుమారాచార్య, మరొక అధ్యాపక మిత్రుడు వే నరసింహారెడ్డి నలుగురం కలిసి మా రచనలను ఒక సంపుటంగా 1967లో ప్రచురించడం జరిగింది.
దీని వెనుక ఉన్న తాత్త్విక భూమికను తెలుగు కవితారంగంలో అప్పటికే వచ్చిన వస్తు వు పరిణామాలను విశదం చేసే ఒక బృహత్పీఠికను నేను చేకూర్చాను. దీనిలో ఉన్న భావమే దాన్ని ఉద్యమంగా చేసింది. ప్రగతి వాద కవిత్వోద్యమం జాతీయ సంప్రదాయానికి చాలావరకు దూరంగా కొంతవరకు వ్యతిరేకంగా ప్రవర్తించింది.
ప్రజాసామాన్యానికి ప్రాచీన సాహిత్యం ద్రోహం చేసిందని ఉద్యమ ప్రారంభంలో ప్రకటించటం జరిగింది. 1960లలో దీనికి ప్రత్యామ్నాయంగా దిగంబర కవిత్వం వచ్చింది. అది కేవలం అశ్లీలంతో సంస్కృతిని హేళన చేయటం, వ్యతిరేకించడం జరిగింది. ఆ క్లిష్టమైన సన్నివేశంలో దీపస్తంభంలాగా చేతనావర్తం వెలువ డింది.
చేతనావర్త కవుల ఆలోచన ధోరణి ఒకటేనా?.. ఆ తర్వాత కొనసాగింపు జరిగిందా? ఆ క్రమంలో రెండు సం పుటాలు మాత్రమే వచ్చినట్టున్నాయి?
చేతనావర్తం రెండు సంపుటాలు వెలువడిన తరువాత దానిలో ప్రముఖంగా పాల్గొన్న నరసింహారెడ్డి పరమపదించారు. ఆ సంపుటాలు తరువాత రాకపోవడానికి ఇది ప్రధాన కారణం. వెలువడిన రెండు సంపుటాలలో కూడా నలుగురు కవుల లక్ష్యం ఒక్కటే. ప్రాధాన్యం విషయంలో భేదం ఉండవచ్చు. శైలి విషయం లో అంతరం ఉండవచ్చు. పలుకుబడి, అభివ్యక్తి లో ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. ‘రుచీనాం వైచిత్రియాత్ ఋజుకుటిల నానా పథగతాం గుణాం ఏకో గమ్యా ’ అన్నట్టు దీనిలోని ఐక్య లక్షణం అంతర్వాహినిగా ఉన్నది.
జాతీయ సాహిత్య వాదం అంటే ఏమిటి? ఏ కవి ఐనా భిన్నంగా రాయగలడా?
జాతీయ సాహిత్య వాదం అంటే తెలుగు కవిత్వ సందర్భంలో భారతీయ సంస్కృతి, రాజ్య వ్యవస్థ, రామాయణ మహా భారతాల లో ప్రపంచించిన జీవన తత్త్వం వంటి అంశాలన్నీ అంతర్భవిస్తవి. ‘సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ ధుఃఖ భాగ్భవేత్’ - ఇది ప్రపంచానికి వేల సంవత్సరాలుగా మన దేశం ఇచ్చిన సందేశం. భిన్నత్వంలో ఏకత్వం విజ్ఞానానికి అనుకూలంగా ప్రవహించటం సర్వ చైతన్యము ఈశ్వర మయమని భావించడం, దుఃఖం నుండి వైరుధ్యాలనుండి, మృత్యువు నుండి విముక్తిని సాధించడం దీని లక్ష్యం.
మీరు, సంపత్ కుమార్, పేర్వారం, ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం తదితరులు మానవ వికాస రచయితల సంఘం (మావిరసం) పాత కొత్తల మేలుకలయక తో ఒక సంఘాన్ని స్థాపించారు. అది ఏ ఉద్దేశంతో స్థాపించారు?
మానవ వికాస రచయితల సంఘం దాదాపు చేతనావర్త లక్ష్యాలను ప్రధానీకరించి ఏర్పడింది. కార్యకర్తలు దూరదూరాలలో ఉండటం చేత ఒక సంస్థగా పనిచేయడంలో ఇబ్బందులు రావడం వల్ల దాని కొనసాగింపు జరగ లేదు. కానీ, ఆ లక్ష్యాలను స్థాపించిన వారితో పాటు వారితో సమలక్ష్యం కలిగిన అనేకమంది రచయితలు కొనసాగించారు.
పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శిగా మీరు చేసిన కృషిని వివరిస్తారా?
పోతన పంచశతి ఉత్సవాలు చేయాలన్న సంకల్పానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, పాములపర్తి సదాశివరావు, కాళోజీ నారాయణరావు మొదలైన పెద్దలు బలపరిచినారు. పీవీ గారు ఇచ్చిన ప్రేరణతో ఒక జాతీయ ఉత్సవంగా 1982 మార్చిలో నిర్వహింపబడ్డాయి. ఈ ఉత్సవాలు ఇచ్చిన ప్రేరణ తో తరువాత పోతన విజ్ఞాన పీఠం ఏర్పడింది.
ఈ పీఠం అనేక సాహిత్య ఉత్సవాలు, అవధానాలు, రూపక ప్రదర్శనలు, సంగీతోత్సవాలు నిర్వహించిం ది. ఒక విస్తృతమైన లక్ష్యంతో పరిశోధన గ్రంథాలయాన్ని నిర్మించింది. టీటీడీ వారి సహాయంతో పోతన విగ్రహాన్ని స్థాపించింది. ఈ పీఠంలో జరిపిన వందలాది కార్యక్రమాల నిర్వహణలో నాకు భాగస్వామ్యం ఉన్నది.
తెలంగాణ ప్రాచీన సాహిత్యం గురించి ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సి ఉంది. వివరంగా చెప్పండి?
కాకతీయుల నాటి నుంచి తెలుగు వారి సంస్కృతి సాహిత్యము లలితకళలకు ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. కాకతీయ సామ్రాజ్యం పడిపోవటం వల్ల ఓరుగల్లు ప్రాంతానికి గ్రహణం పట్టింది. సుమారు 600 సంవత్సరాలు బానిసతనంతో ముడుచుకునిపోయే సన్నివేశం వచ్చింది. కానీ ఈ ప్రాంత ప్రజలు ధైర్యంతో తమ భాషను, సం స్కృతిని, సాహిత్యాన్ని సజీవంగా నిలుపుకున్నారు.
ఆక్రామకులకు విరుద్ధంగా బగళా ఆరాధన బతుక మ్మ పండుగ రూపంలో ఏర్పరుచుకొని వర్ణ భేధాలకు అతీతంగా ఐక్యతను కాపాడుకున్నారు. మరుగు పడిపోయిన జీవ న అంశాలను, చరిత్రను, సాహిత్యాన్ని వెలికి తీసి ఈ తరానికి తెలియజెప్పవలసిన అవసరం ఉన్నది. ఆ దిశగా నేను చేసిన కృషిని చేర్చుకోవచ్చు. ఈ ప్రయత్నం చేయడానికి నా వంతు సహాయాన్ని సమకూరుస్తానని ఇంత కు ముందే పేర్కొన్నాను. ఇప్పుడు కూడా ఈ సాహిత్యాన్నంతా వెలికి తీసి శోధించాల్సిన అవసరం ఉన్నది.
కొత్త తరం కవులు, పండితులు విస్తృతంగానే వస్తున్నారు రాస్తున్నారు. కానీ ఇదివరకటిలా సాహిత్య అభిలాషకుల శ్రోతల సంఖ్య తగ్గుతుంది. కారణం ఏమంటారు? ఆ దిశగా మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి?
ఎప్పుడు కూడా వర్తమానంలో జరుగుతున్న కృషిని దాని అభివృద్ధిని వెలుగులను సరిగా అంచనా వేయలేం. కాలం గడిచేకొద్దీ గడచిన కాలంలోని లక్ష్య శిఖరాలు వెలుగులోకి వస్తాయి. ఈనాడు కూడా జరుగుతున్న కృషిలో ఎంతో చెప్పుకోదగిన అంశాలు ఉన్నాయి. సామాన్యమైనవి వర్తమానంలో ప్రముఖంగా గోచరిస్తాయి కానీ, కాలం జల్లెడపట్టి వాటిలో బలమైన వాటినే నిలుపుతుంది.
బలహీనమైన వాటిని జారవిడుస్తుంది. నాకు ఈ ఎనభై సంవత్సరాలలో తెలంగాణలోని సాంస్కృతిక రంగం సాధించిన అంశాలు ఉన్నతమైనవిగానే కనిపిస్తున్నవి. ఆరువందల యాభై సంవత్సరాల అణచివేత కూడా లక్ష్యసాధనకు అడ్డం రాలేదు. వెదికితే కదిపితే కుదిపితే మరుగుపడ్డ అంశాలు జ్వలంతంగా కనిపిస్తాయి.
ఆధునిక వచన కవిత్వంలో మినీ కవిత, హైకూలు, నానీలు లాంటి కవిత రూపాలు వచ్చాయి ... వీటిపై మీ అభిప్రాయం?
సాహిత్య పరిణామంలో భిన్న భిన్నమైన అభివ్యక్తి మార్గాలు, ప్రక్రియలు వెలికి వస్తాయి. ప్రయోగ దశ దాటి పరిణామ దశ దాటి అవి కాలపరిస్థితులను ఎదురొడ్డి తప్పతకుండా నిలుస్తాయి.
మీ అమూల్య సమయాన్ని వెచ్చించి ఎంతో అపురూపమైన సమాచారమిచ్చిన మీకు సాహితీలోకం ఋణపడి యుంటుంది.
తెలంగాణ భాషా సంస్కృతులపై జరిగిన దాడిని ఏమంటారు?
మనకు జరిగిన నష్టం ఎంత?
తెలంగాణ సాహిత్య విషయంలో ఆంధ్ర ప్రాంతం లో అనిష్టంగానీ ఉపేక్ష కానీ ఉన్నట్టు కనిపించదు. కవిత్రయ భారతం కంటే, పోతన భాగవతానికి ఎక్కువ ఆదరణ లభించింది. కొన్ని సందర్భాలలో సమాచారం తెలియక ఒకరిద్దరు విమర్శకులు తెలంగాణ లో కవుల సంఖ్య పూజ్యమని అన్న మాట నిజమే. కానీ, దానికి వెంటనే సమాధానంగా గోలుకొండ కవుల సంచిక వెలువడింది. దాశరథి, నారాయణరెడ్డి, పల్లా దుర్గయ్య, వానమామలై వరదాచార్యులు మొదలైన కవుల రచనలు తెలుగు దేశం సర్వత్రా ప్రసిద్ధిని పొందాయి. తెలంగాణ సాహిత్యానికి సరైన పోషణ లభించకపోవడం వల్ల చాలా సాహిత్యం కాలగర్భంలోనే ఉండిపోయింది.
పొట్లపల్లి శ్రీనివాసరావు




