09-11-2025 06:48:46 PM
అంబేద్కర్ సేవలను ప్రతినిత్యం స్మరించుకోవాలి
బోడుప్పల్లో 351వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 351వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మాజీ ఉప సర్పంచ్ బాలరాజు గౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగ ఫలమైన రాజ్యాంగంతోనే నేటి రాజకీయ నాయకులు ఉన్నత పదవులను అనుభవిస్తున్నారు. మరికొందరు రిజర్వేషన్లతో ఉన్నతమైన ఉద్యోగాలు పొంది నేడు అంబేద్కర్ త్యాగాన్ని, సేవలను స్మరించలేని దీనస్థితిలో ఉండడం దురదృష్టమని, బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ స్ఫూర్తితో విద్య రాజకీయ రంగాలలో మరింత ఉన్నత స్థానాలకు చేరాలని నత్తి మైసయ్య అన్నారు.
అనంతరం బాలరాజు గౌడ్ మాట్లాడుతూ 350 ఆదివారాలుగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఎంతోమంది యువకులలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపుతున్న నత్తి మైసయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, బహుజన ఉపాధ్యాయ సంఘం స్టేట్ సెక్రెటరీ ఇటుకల రవీందర్, రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, మైసగళ్ళ జానీ కుమార్, బండారి సాయి, యేసు రాజు, కంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు.