తొలి బోనం అందుకునే గోల్కొండ జగదంబ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల జాతర. తొలకరి పలకరింపుతోపాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కళ వచ్చేస్తుంది. నగరాలు పల్లె కళను సం తరించుకుంటాయి. పచ్చని తోరణాలతో ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. ఎటు చూసినా సంప్రదాయం ఉట్టిపడుతుంది. కట్టూబొట్టూ మారిపోతుంది. ఇం టిల్లపాదిలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. నిజానికి బోనాల పండుగ ప్రకృతి ఆరాధనోత్సవం. వానాకాలంలో ప్రజలను ఆదుకోవాలనే నేపథ్యంలో వరుణుడు, దుర్గామాతల కోసం ఈ ఉత్సవాలు జరుగుతాయి. విపత్తులు, వ్యాధులు సంభవించే అవకాశం వానాకాలంలో ఎక్కువగా ఉంటుంది.
ఈ కాలంలో తమను చల్లగా చూడాలంటూ భక్తు లు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. 1869లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి వచ్చి వేల మంది చనిపోయా రు. దీంతో అమ్మవారిని శాంతింపజేయడానికి ఏడాదంతా భోజనం పెట్టే ఆ తల్లికి మనమంతా కలిసి భోజనం పెట్టి మనలను కాపాడాల్సిందిగా వేడుకోవాలని పెద్దలు నిర్ణయించుకున్నారట. కాలక్రమంలో ఈ ‘భోజన’మే బోనంగా మారింది. ఆషాడమాసం బోనాలు గోల్కొండ కోటలోని జగదంబ ఎల్లమ్మ ఆలయంనుంచే ప్రారంభమవుతా యి. ఆషాఢంలో తొలి ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే బోనాలు చివరి ఆదివారం లాల్‌దర్వాజా లో జరిగే బోనాలతో ముగుస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మతోపాటు బోనాలనూ అధికారికంగా నిర్వహిస్తోంది.
900 ఏళ్లకు పైగా చరిత్ర
గోల్కొండ కోటకు వెళ్లే మెట్ల మార్గంలో ఒక చిన్న గుహలో ఉండే జగదాంబ ఆలయం హైదరాబాద్‌లోని పురాతన ఆలయాల్లో ఒకటి. దాదాపు 900 నుంచి వెయ్యి ఏళ్ల నాటి దేవాలయం ఇది. గొర్రెల కాపరులు మొదట ఈ ఆలయాన్ని కనుగొన్నారని చెబుతారు. కాకతీయుల పాలనలో మంకల్ లేదా మంగళవారంగా పిలువబడే గోల్కొండ కాక తీయ పాలకుల బహిర్భూమిగా ఉండేది. కుతుబ్‌షాహీలు ఈ నాటికీ ఉన్న గొప్పకోటను నిర్మించడానికి ముందు ఒక మట్టికోట ఉండేది. మట్టికోటలో ఉండే సైనికులు మాతృదేవతకు ప్రార్థనలు చేసేందుకు వీలుగా ఈ జగదంబ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని చెబుతారు.
ఈ చారిత్రక ఆలయం ఇబ్రహీం మసీదు, రాజు ప్యాలెస్‌కు పక్కనే ఉంది. గోల్కొండ పాలకులు అన్ని విశ్వాసాలను గౌరవించారనడానికి ఇంతకన్నా నిదర్శనం వేరే ఏముం టుంది. తొలుత కాకతీయులు పూజించిన ఈ ఆలయం ఆ తర్వాత నిజాం నవాబుల అధీనంలోకి వచ్చింది. అయితే భక్తులు అమ్మవారిని పూజించడానికి నవాబులు అనుమతించారని, కోటపైకి వెళ్లడానికి వీలుగా మెట్లు సైతం వారే నిర్మించారని చెబుతారు. దాదాపు 300కు పైగా మెట్లు ఎక్కి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. మెట్లన్నీ కూడా భక్తులు రాసిన పసుపు గుర్తులతో అలరారుతుంటాయి.
నిజానికి ఈ ఆలయం చాలా చిన్నది. కోటలోని ఓ కొండపై ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇది అభివృద్ధికి నోచుకోలేదు. అయితే అనేక పోరాటాల తర్వాత ఇటీవలి సంవత్సరాల్లో ఆలయానికి ఒక షెడ్ నిర్మించారు. గోల్కొండ కోట కేంద్రప్రభుత్వ పురావస్తు శాఖ (ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్) అధీనంలో ఉండడమే దీనికి కారణం. ఇక్కడ ఏ అభివృ ద్ధి చేపట్టాలన్నా ఆర్కియాలజీ విభాగం అనుమతి అవసరం. కానీ ఇవేవీ ఏటా వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఆటంకం కాలేదు.
గుహలో అసలు విగ్రహాలు
వాస్తవానికి ఆలయానికి రెండు భాగాలు ఉన్నా యి. ప్రధాన ద్వారం వెనుక ఆధునిక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. దాని వెనుక ఓ చిన్న గుహ ఉంది. ఇక్కడే అసలు విగ్రహాలు ఉంటాయి. ఇక్కడకు చేరుకోవడానికి ఇరుకైన మెట్ల మార్గాన్ని దాటాల్సి ఉంటుం ది. ఇరువైపులా మహంకాళి, దుర్గల భారీ చిత్రాలు కనువిందు చేస్తాయి. ఆలయం కింది భాగంలో ఒక సొరంగం ఉందని, అది నేరుగా చార్మినార్‌కు తీసుకువెళ్తుందని చెబుతారు. కోటపై ఏదయినా దాడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి మార్గంగా ఈ సొరంగం నిర్మించారని చెబుతారు.
అయితే ఈ రహస్య సొరంగం ఉన్న మార్గాన్ని ఇప్పుడు మూసి వేశారు. కాగా బోనాల సమయంలో భక్తు లు సమర్పించిన తొట్టెలు, అలంకార కిరీటాలు వందల సంఖ్యలో మనకు దర్శనమిస్తాయి. వెనుకవైపు నవాబుల కోట, ముందు వైపు ఆధ్యాత్మిక శోభతో అలరారే ఆలయం మనకు ఓ విచిత్రమైన భావాన్ని కల్పిస్తాయి. సామ్రాజ్యాలు, చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయినా వందల ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా నిలిచిన జగదంబ మహంకాళి ఆలయం గోల్కొండ కోటతోపాటు హైదరాబాద్ చరిత్రకు గుర్తుగా నిలిచి ఉంది.






