ఆస్తిపన్ను బకాయిదారులకు శుభవార్త
వడ్డీపై 90 శాతం మాఫీ
- మార్చి 31వరకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ అమలు
- జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 సర్కిళ్లకు కూడా వర్తింపు
- ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నింటికీ అవకాశం..
- ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): నగరంలోని ఆస్తిపన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏళ్ల తరబడి పన్నులు కట్టలేక, వడ్డీల భారం మోయలేక సతమతమవుతున్న వారికి భారీ ఊరటనిస్తూ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది. 2025--26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసిం ది.
దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతా న్ని మాఫీ చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తుల బకాయిలకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొనడం విశేషం.
పథకం ఎలా వర్తిస్తుంది..
ఈ బంపర్ ఆఫర్ పొందాలనుకునే వారు తాము చెల్లించాల్సిన అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఇప్పటివరకు పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభు త్వం పూర్తిగా రద్దు చేస్తుంది. అయితే, ఈ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులపై వడ్డీ భారాన్ని తగ్గించాలన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా విలీనమైన 27 సర్కిళ్లకు కూడా..ఇటీవలే జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సి పల్ సర్కిళ్లలోనూ ఈ ఓటీఎస్ పథకాన్ని అమలు చేయనున్నారు. కొత్త సర్కిళ్లలో ప్రస్తు తం క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా, పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రెంటల్ వ్యాల్యూ ఆధారంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఏ పద్ధతిలోనైనా బకాయిలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
టార్గెట్ రూ. 3 వేల కోట్లు
విలీనంతో పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకుని, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సవరించారు. తొలుత రూ. 2,200 కోట్లుగా ఉన్న లక్ష్యాన్ని, ఆ తర్వాత రూ. 2,500 కోట్లకు, తాజాగా రూ. 3,000 కోట్లకు పెంచారు.ఇప్పటివరకు పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 1,478 కోట్లు వసూ లయ్యాయి.లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా రూ. 1,522 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.విలీన సర్కిళ్ల నుంచి రూ. 500 కోట్లు, పాత బకాయిల నుంచి మరో రూ. 1,000 కోట్లు రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, ఈ మూడు నెలల పాటు ఓటీఎస్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, బకాయిలను క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుంటే అటు ప్రజలకు వడ్డీ భారం తప్పుతుందని, ఇటు కార్పొరేషన్ ఖజానాకు నిధులు చేరుతాయని భావిస్తున్నారు.






