17 June, 2026 | 11:32 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

అల్విదా గబ్బర్

25-08-2024 12:30 AM
  1. అంతర్జాతీయ క్రికెట్‌కు శిఖర్ ధావన్ వీడ్కోలు
  2. 14 ఏళ్ల కెరీర్‌కు ముగింపు

మొహంపై చెదరని చిరునవ్వు.. ప్రత్యర్థులను భయపెట్టేలా మీసం మెలేసి తొడగొట్టిన ఆ మొనగాడు ఇకపై మైదానంలో కనిపించడంటే ఏదో తెలియని వెలితి. సహచరుల చేత ముద్దుగా ‘గబ్బర్’ అని పిలిపించుకున్న శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 14 ఏళ్ల కెరీర్‌లో సూపర్ హిట్ ఇన్నింగ్స్‌లతో అలరించిన ధావన్ భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు. అల్విదా గబ్బర్..

న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్లతో పోటీ పడి జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని పేర్కొన్న ధావన్ ‘ఎక్స్’ వేదికగా వీడ్కోలు విషయాన్ని పంచుకున్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. టెస్టులు, టీ20ల కంటే వన్డే క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న ధావన్ 44.11 సగటుతో 6793 పరుగులు సాధించాడు.

ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 34 టెస్టుల్లో 2315 పరుగులు, 68 టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో చివరి వన్డే ఆడిన ధావన్ ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కుతుందని భావించినప్పటికీ కుర్రాళ్ల నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో ధావన్‌కు మొండిచెయ్యి ఎదురైంది.

అరంగేట్రంలోనే అదుర్స్

2010లో మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యా చ్ జరిగింది. ఈ మ్యాచ్‌తోనే శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్టులోనే ధావన్ 85 బంతుల్లో 185 పరుగుల చేసి అదుర్స్ అనిపించాడు. మధ్యలో ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ధావన్ కెరీర్‌లో 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టర్నింగ్ పాయింట్. ఆ టోర్నీలో ధావన్ 363 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.

అయితే వయసు మీద పడడం.. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు దూసుకురావడంతో ధావన్ క్రమంగా జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ ధావన్ చెరగని ముద్ర వేశాడు. ధావన్ 222 మ్యాచ్‌ల్లో 6769 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 51 అర్థసెంచరీలున్నాయి. 2016 సీజన్‌లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ జట్టులో ధావన్ సభ్యుడిగా ఉన్నాడు.

గబ్బర్ పేరు ఇలా..

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే శిఖర్ ధావన్ ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆటతోనే కాదు మైదానంలోనూ చలాకీగా ఉంటూ సహచరులను నవ్వించేవాడు. అందుకే అందరూ అతన్ని ముద్దుగా గబ్బర్ అని పిలిచేవారు. కాగా ధావన్‌కు గబ్బర్ అని పేరు పెట్టింది మాత్రం మాజీ క్రికెటర్ విజయ్ దహియా. రంజీ మ్యాచ్ సమయంలో జట్టు సభ్యుల్లో ఉత్సాహంనింపేందుకు షోలే సినిమాలోని  ‘సౌర్ కే బచొన్’.. ‘బహుత్ యారానా లగ్‌తా హై’  డైలాగ్స్‌ను తరచూ చెప్పేవాడు. దీంతో విజయ్ దహియా ఒక సందర్భంలో ధావన్‌ను ‘గబ్బర్’ అని పిలిచారు. అలా శిఖర్ ధావన్‌కు గబ్బర్ అనేది ముద్దు పేరుగా మారిపోయింది.