కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు... జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను
- కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ లోకి చేరాలని ఉద్దేశం లేదు
- నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లుల నిమిత్తం కాంగ్రెస్ లోకి
- వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని కార్యకర్తలకు ధీమా
- ఎమ్మెల్యే పోచారం పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు
బాన్సువాడ, ఆగస్టు 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అయితే నియోజకవర్గంలోని కార్యకర్తలు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల కోసం తన కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డిని సీఎం సోదరుడు కృష్ణారెడ్డి వద్దకు పంపించినట్లు తెలిపారు.అక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలన్నా, కొత్త పనులు మంజూరు కావాలన్నా పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందేనని స్పష్టంగా చెప్పినట్లు పోచారం పేర్కొన్నారు.
దీంతో తాను పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించినట్లు తెలిపారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు.. జాతీయ జెండానే కప్పుకున్నాను అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటెలిజెన్స్ సర్వేలో తమ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని కార్యకర్తలకు పోచారం ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ మార్పు వెనుక ఉన్న కారణాలను కార్యకర్తల సమావేశంలో పోచారం వెల్లడించడంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో నాయకులు శశికాంత్ నార్ల రవీందర్ ఏర్వాల కృష్ణారెడ్డి ఏజాజ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






