30 May, 2026 | 2:41 PM

Breaking News

మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

30-05-2026 02:07 PM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడి బాట” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, నమోదు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అమ్మ మాట – అంగన్‌వాడి బాట కార్యక్రమం ద్వారా తల్లి, శిశు ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన పోషకాహారం, వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారి ఎదుగుదల, బరువు, ఎత్తు వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులు, హాజరు పట్టికలు, గుడ్లు, పోషకాహార నిల్వలు, పంపిణీ విధానాలను పరిశీలించిన కలెక్టర్, గర్భిణీలు మరియు బాలింతలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.