25 May, 2026 | 1:26 AM

నెరవేరిన కల..

25-05-2026 01:03 AM

అగ్నిమాపక కేంద్రం హామీ నెరవేర్చిన ‘వేం’..

కేసముద్రంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం 

కేసముద్రం, మే 24 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి కేసముద్రం ప్రాంతవాసులు ఎదురుచూస్తున్న ఫైర్ స్టేషన్ కల ఎట్టకేలకు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కృషితో ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర మంత్రివర్గం శనివారం నిర్వహించిన సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామానికి చెందిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక  బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ సహకారంతో  కేసముద్రం మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతులతో పాటు ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో సమీపంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల ఆస్తి నష్టం, ఆర్థికంగా నష్టపోతున్న సంఘటనలు జరుగుతుండడంతో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యాపరంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ కేసముద్రం మండలం కేంద్రంలో మంజూరు చేయించగా, ఏటిఐ సెంటర్ ఇనుగుర్తిలో ఏర్పాటు చేయించారు.

ముందుగా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు చేయించి, ఆ తర్వాత పట్టణ కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి, నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్, పోలీస్ సర్కిల్, పట్టణంలో అన్ని ప్రధాన రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, నూతనంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం, 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, రెండు 32 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు చేయించి, నిర్మాణాలను కూడా చేపట్టారు.

ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్తో పాటు పారిశ్రామికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరు గడించిన కేసముద్రంలో అనేకసార్లు మిల్లుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీనితో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని అగ్నిమాపక కేంద్రాన్ని శనివారం మంజూరు చేయించారు. అగ్నిమాపక కేంద్రం, అందులో విధులు నిర్వహించడానికి ఫైర్ ఆఫీసర్ తో పాటు 17 పోస్టులను కూడా మంజూరు చేయించి స్వీపర్ పోస్ట్ ఔట్సోర్సింగ్ ద్వారా మంజూరు చేయించారు.

గతంలో నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండగా, మహబూబాబాద్ లో ఇప్పటికే అగ్నిమాపక కేంద్రం ఉండడంతో ప్రభుత్వం కేసముద్రంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయడానికి మొదట అంగీకరించకపోవడంతో, మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నేపథ్యంలో, మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేసముద్రంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు కేసముద్రం మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అగ్ని మాపక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

దీంతో అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలకు కలగా మిగిలిన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం మంజూరుకు కృషిచేసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.