ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బిగ్ ఆఫర్
- ఈ-వాహనాల మార్పిడికి రూ.200కోట్లు కేటాయింపు
- ఆటోలను ఈవీలుగా మార్చితే రూ.1.50 లక్షల సాయం
- కేకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రాజశేఖర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఆగస్టు 28 : ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పాత ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా (రెట్రో ఫిట్మెంట్) మార్చుకునేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేకేసీ (కామ్గార్ అండ్ కర్మచారి కాంగ్రెస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టి. రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
కేకేసీ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ నాయకత్వంలో క్యాబ్, ఆటో డ్రైవర్ల సమస్యలను రవాణా, కార్మిక శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేశామని పేర్కొన్నారు. ఆటోలను ఈవీలుగా మార్చే క్రమంలో డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కేకేసీ చేసిన వినతులను ప్రస్తావించడం తమ పోరాట కృషికి నిదర్శనమన్నారు.
ఇదే తరహాలో క్యాబ్, ఆటో కిలోమీటర్ చార్జీల పెంపుతో పాటు రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక ‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటుపై కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేశారు. డ్రైవర్ల హక్కులు, సంక్షేమం కోసం కేకేసీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాజశేఖర్‌రెడ్డి పునరుద్ఘాటించారు.






