15 July, 2026 | 11:12 AM

బడ్జెట్‌పై సర్కారు కసరత్తు

08-06-2024 02:02 AM

ఖజానాకు వచ్చేదెంత? పోయేదెంత? అనే అంశాలపై ఆరా

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు అధిక ప్రయారిటీ

జూలైలో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 

పూర్తిస్థాయి పద్దుకు ఆర్థికమంత్రి సమీక్షలు షురూ

హైదరాబాద్, జూన్ 07 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం 2024 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌పై దృష్టి సారించింది. ఎన్నికల కోడ్‌ను ఈసీఐ ఎత్తేసిన నేపథ్యంలో పాలనకు అవసరమైన నిధుల కేటాయింపులు, అంచనాలను సిద్ధం చేసే పనిలో రేవంత్‌రెడ్డి సర్కారు నిమగ్నమైంది. ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల ముందు రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క.. ఇప్పుడు పూర్తిస్థాయిలో పద్దును శాసనసభలో పెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు.

బడ్జెట్ ప్రక్రియలో భాగంగా ఖజానా కు ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చు ఎంత అవుతుంది? వ్యయాన్ని ఆదా చేసే మార్గాలు ఏంటి? అనే అంశాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం సచివాలయంలోని తన పేషీలో ఆర్థిక, వాణిజ్య, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఆర్టీసీ సహా పలు శాఖల కీలక అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

పంద్రాగస్టులోపు బడ్జెట్ సమావేశాలు!

ఫిబ్రవరిలో రూ.2.75లక్షల కోట్లతో ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు నాలుగు నెలలు. జులైతో ఈ బడ్జెట్ గడువు ముగియనుంది. దీంతో మరో 8 నెలల కోసం ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో  ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే సర్కారు పూరిస్థాయి పద్దు కోసం ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ పూర్తయిన తర్వాతే రాష్ట్రం పద్దును ప్రవేశపెడుతుంది. అయితే ఈ ఏడాది కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఆగస్టు 31 వరకు ఉంది. ఆగస్టు చివరివారంలో కేంద్రం బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది.

కానీ, రాష్ట్ర బడ్జెట్ గడువు జూలైతో ముగియనుండటంతో పాటు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీకే వడ్డీలతో కలుపుకొని దాదాపు రూ.40వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంచనాలను సవరించి కొత్త బడ్జెట్‌లో 6 గ్యారెంటీలకు కేటాయింపులను పెంచిన తర్వాత రుణమాఫీని అమలు చేస్తారా? లేకుంటే బడ్జెట్‌తో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బడ్జెట్‌ను సవరించిన తర్వాతే రుణమాఫీ చేయాలని సర్కారు భావిస్తే ఆగస్టు 15వ తేదీలోపు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఆరు గ్యారెంటీలే కీలకం

పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. వీటి అమలు కోసం ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకునేందుకు అధికారులతో సమీక్షలను మొదలు పెట్టింది. అనంతరం బడ్జెట్ రూపకల్పనకు అంచనాలను పంపాలని వివిధ శాఖలను ఆర్థిక శాఖ కోరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికశాఖ సిద్ధం చేయనుంది.