15 July, 2026 | 10:58 AM

ఆదాయాన్ని ఎలా పెంచుదాం?

08-06-2024 02:03 AM

వివిధ శాఖల పనితీరుపై మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

హైదరాబాద్, జూన్ 7 ( విజయక్రాంతి): రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆయా శాఖల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే గత రెండేళ్ల ఆర్థిక సంవత్సరాల ప్రగతిని ఆరా తీశారు. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆయా శాఖ అధికారులను భట్టి ఆదేశించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పటిష్ఠపర్చడం ద్వారా బడ్జెట్ అంచనాలను అందుకోవాలని సూచించారు. ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును తెలుసుకున్నారు. 

వడ్డీ భారం తగ్గించుకోవాలి..

ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం వివిధ సంస్థలకు చెల్లిస్తున్న రుణాలు, వడ్డీలపై సమీక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రి భట్టి దిశానిర్దేశం చేశారు. తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులకు రుణాలను మళ్లించాలని స్పష్టం చేశారు. ఈ ప్రయోగాన్ని ఇటీవల సింగరేణిలో చేసి విజయవంతమైనట్లు చెప్పారు. ఫలితంగా రూ.వందల కోట్ల ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. అలాగే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్)పైనా భట్టి సమీక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు ఆదాయాన్ని పెంచాలని సూచించారు. అన్ని అర్హతలు ఉన్న స్థలాలకే ఎల్‌ఆర్‌ఎస్‌ను వర్తింపజేయాలన్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హౌసింగ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వాటి ద్వారా ఆదాయం వంటి వివరాలను ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని కొన్ని ఇళ్లు ఉన్న నేపథ్యంలో వాటిపైనా మంత్రి ఆరా తీశారు.

ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు

రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. బకాయిలను నెలకోసారి చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే ధరలకే ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ చికిత్స అందించేలా యాజమాన్యాలను ఒప్పించాలని అధికారులకు సూచించారు.

ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమన్న విషయాన్ని ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.