గురు ద్రోహులు!
నకిలీ చదువులతో ప్రభుత్వ లెక్చరర్ కొలువులు
ఇంటర్ బోర్డు విచారణలో దొంగ లెక్చరర్ల భాగోతం రట్టు
37 మంది దొంగల అసలు రంగు బట్టబయలు
ఎ.చంద్రశేఖర్‌రావు
సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (టీజీబీఐఈ) జరిపిన అంతర్గత విచారణలో ప్రైవేట్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల దందా వెలుగుచూడటంతో, సమాం తరంగా ప్రభుత్వ లెక్చరర్ల సర్టిఫికెట్లపై కూడా ప్రత్యేక రీ-వెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టారు. గతం లో కాంట్రాక్ట్ సర్వీసుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ పొందిన 360 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను పరిశీలించగా వారిలో ఏకంగా 37 మంది లెక్చరర్లు నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నట్లు బట్టబయలైంది.
ఉమ్మడి ఏపీలోనే బీజం
ఈ 37 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఎలాంటి పక్కా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేకుండానే కిందిస్థాయి రాజకీయ సిఫార్సులతో ప్రైవేట్, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లుగా చేరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో కాంట్రాక్ట్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించి నప్పుడు పీజీ లేదా నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హత పత్రాలు సబ్మిట్ చేయాల్సి రావడంతో నకిలీ దందాను ఆశ్రయించారు.
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలను సంప్రదించి ఒక్కొక్కరు రూ.2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు చెల్లించి ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ పీజీ, ఎంఏ, ఎమ్మెస్సీ, బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లపై ఉండే హోలోగ్రామ్లను, సదరు యూనివర్సిటీల వైస్ చాన్సలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాలను కలర్ జిరాక్స్, డిజిటల్ స్కానింగ్ ద్వారా ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డు ఫైళ్లలో పెట్టారు.
ఇంటర్ బోర్డు అధికారులు అనుమానం వచ్చిన 360 మంది సర్టిఫికెట్లను నేరుగా ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు పంపి అంతర్గత ధృవీకరణ చేయించారు. ఆయా వర్సిటీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఉపకులపతులు ఇంటర్ బోర్డుకు పంపిన నివేదికలో మైండ్ బ్లాయింగ్ విషయాలు చెప్పారు. 37 మంది సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లపై ఉన్న రోల్ నంబర్లు, హాల్ టికెట్ నంబర్లు పూర్తిగా తప్పు అని, ఆ నంబర్లతో తమ వర్సిటీలలో అసలు ఏ విద్యార్థి చదవలేదని తేల్చారు.
పలు జిల్లాల్లో అక్రమార్కులు
రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 8 నుండి 10 మంది లెక్చరర్ల పీజీ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల పరిధిలో ఏడుగురు లెక్చరర్లు నకిలీ పొరుగు రాష్ట్రాల యూనివర్సిటీ పత్రాలు సమర్పించి దొరికిపోయారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ టౌన్ పరిధిలోని కాలేజీల్లో ఆరుగురు లెక్చరర్ల భాగోతం రట్టయింది.
వీరు ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన నకిలీ డిగ్రీలు సృష్టించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న ఐదుగురు లెక్చరర్ల బీటెక్, పీజీ పత్రాలు నకిలీవిగా నిర్ధారణ అయ్యాయి. నాగర్‌కర్నూల్, గద్వాల, సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతాల్లో కలిపి ఆరుగురు లెక్చరర్లకు ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి (పటాప్‌చెరు పరిసర ప్రాంతాలు), నిజామాబాద్ రూరల్ పరిధిలో మిగిలిన ముగ్గురు నుంచి నలుగురు లెక్చరర్ల అక్రమాలు వెలుగుచూశాయి.
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
37 మంది దొంగ లెక్చరర్లు దశాబ్దాల తరబడి వ్యవస్థను మోసం చేస్తూ, ఏటా ప్రభుత్వ జీతాలు లూటీ చేస్తున్నారంటే.. విద్యాశాఖ అధికారుల చేతకానితనం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే నిర్లక్ష్య వైఖరే కారణమని విద్యా రంగా నిపుణులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్ల సర్టిఫికెట్లను, వారి అర్హతలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు తనిఖీ చేయాలి. కానీ ఏళ్ల తరబడి ఒక్క అధికారి కూడా ఈ 37 మంది సర్టిఫికెట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయకపోవడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణ లు వస్తున్నాయి. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఇంటర్ బోర్డు ప్రత్యేక స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేసింది.
సదరు కమిటీ సభ్యులు అభ్యర్థులు సమర్పించిన కలర్ జిరాక్స్ కాపీలను చూసి ఓకే చేసేశారే తప్ప, వాటి నిజానిజాలను తెలుసుకోవడానికి సంబంధిత విశ్వవిద్యాలయాలకు ఎందుకు పంపలేదనే ప్రశ్న ఉత్నన్నమవుతోంది. బోర్డులోని కొందరు పెద్దల ‘ఆశీస్సులు‘, భారీగా చేతులు మారిన ముడుపుల వల్లే ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ లేకుండానే ఫైళ్లను గంపగుత్తగా క్లియర్ చేసేశారనేది బహిరంగ రహస్యం. అంతేగాకుం డా హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్, అమీర్పేట్, అశోక్నగర్ కేంద్రాలుగా నడుస్తున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠాల వివరాలు పోలీసులకు తెలిసినా విద్యాశాఖ వాటిపై ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు.
నిఘా నీడలో ఉమ్మడి మెదక్ జిల్లా?
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, పటానెన్‌చెరు, రామచంద్రాపురం పరిధిలోని కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు లెక్చరర్ల సర్టిఫికెట్లు నకిలీవని ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన ఒక నిందితుడు హైదరాబాద్ కేంద్రంగా శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడుపుతూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వర్సిటీల పేరుతో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురికి నకిలీ పీజీ, బీఈడీ సర్టిఫికెట్లు అమ్మినట్లు గతంలో పోలీస్ రికార్డులలో నమోదైంది. ఈ ముఠా ద్వారానే కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జూనియర్ లెక్చరర్ల విద్యార్హతలపై కూడా ఇంటర్ బోర్డు డేటాను పూర్తిగా జల్లెడ పడుతోంది.






