19-05-2024 02:15:28 AM
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, మే 18 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి నిదర్శనమన్నారు.
అకాల వర్షాలు పడి రైతులు నష్టపోతుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు. తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకాన్ని మంటగలిపారని, ఉచిత మహిళా బస్సుచెప్పి మెదక్ నియోజకవర్గంలో 9 రూట్లలో బస్సులు బంద్ చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజవరకు ధాన్యాన్ని కొన్నదని గుర్తు చేశారు.
కానరాని మెదక్ ఎమ్మెల్యే
అకాల వర్షాలు పండి రైతులు నష్టపోతుంటే మెదక్ ఎమ్మెల్యే కనిపించడం లేదని విమర్శించారు. రైతులు రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం చెప్పింది మంత్రులకు తెలుస్తలేదని, మంత్రులు చెప్పింది ఎమ్మెల్యేలకు తెలుస్తలేదని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పత్తాలేకుండా పోయారని ఆరోపించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మెదక్, హవేళీఘణపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, సిహెచ్. శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు కిషోర్, జయరాజ్, నాయకులు సలాం, ప్రభురెడ్డి, కిషన్‌గౌడ్, బట్టి ఉదయ్, ఇస్మాయిల్, నరేందర్ పాల్గొన్నారు.