19-01-2026 12:00:22 AM
మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పా ట్లపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు సంబం ధించిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, సమ్మక్క సారలమ్మ ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ మ్యాప్స్, సీసీటీవీ పర్యవేక్షణ, అధునాతన డ్రోన్ టెక్నాలజీ ద్వారా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ జాతర సందర్భంగా అమలు చేస్తున్న భద్రతా ప్రణాళికలు, పోలీసు బలగాల మోహరింపు, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై డీజీపీకి వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిజిపి పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఐజీ మల్టీ జోన్1 చంద్రశేఖర్ రెడ్డి, అంబర్కిషోర్ ఝా, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరిష్, భూపాలపల్లి ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, డీసీపీ అంకిత్, శివం ఉపాధ్యాయ ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు డిజిపి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.