10 April, 2026 | 2:02 AM

వయోవృద్ధులు, స్త్రీ, శిశు, మాత సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు

10-04-2026 12:34 AM

మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో అంగన్వాడి సేవల బలోపేతానికి మొబైల్ ఫోన్లో పంపిణీ 

మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వయోవృద్ధులు, మాతా శిశు సంక్షేమానికి వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేస్తూ, వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

గురువారం మహబూబాబాద్ పట్టణంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభించి, అంగన్వాడి టీచర్లకు 1,313 మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి, పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళి నాయక్, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి  లతో కలిసి నిర్వహించారు. వృద్ధుల సంరక్షకులకు జీవనశైలి మెరుగుపడడం కోసం డేకేర్ సెంటర్ ఉపయోగపడు తుందని, ఒంటరితనాన్ని మరిచిపోయి,

సంతోషంగా ఉండటం కోసం రూపొందించబడిన ఈ కేంద్రం ద్వారా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని వయోవృద్ధులు వివిధ క్రీడలలో పాల్గొనవచ్చని, తద్వారా మానసిక ప్రశాంతతబి ఉల్లాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల వ్యయం తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఈ కేంద్రంలో టీవీ, దినపత్రికలు మ్యాగజీన్, పాటల పోటీలో క్యారమ్స్, చెస్, మొదలగైన ఆటలు అందుబాటులో ఉంటాయని, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కేంద్రంలో ప్రథమ చికిత్స ఆరోగ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి వారానికి ఒకసారి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉంటారని తెలిపారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా వయవృద్ధులు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు వివిధ పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా క్షేత్రస్థాయిలో డిజిటల్ విధానంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు పౌష్టిక ఆహారం, స్థితిగతులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం పారదర్శకంగా పాలన కొనసాగుతుందన్నారు.

పోషణ్ పఖ్వాడా ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహార పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు, ఆహార పంపిణీ అంశాలను నమోదు చేయవచ్చని తెలిపారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం లక్ష్యమని, ఈ కార్యక్రమం ఈ నెల 9 నుంచి 23 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.   జిల్లా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో,  కె. అనిల్ కుమార్, జిల్లా వెల్ఫేర్ అధికారిని సబిత, సిడిపిఓలు శిరీష, సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.