calender_icon.png 9 January, 2026 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు నిర్లక్ష్యం..!

09-01-2026 12:00:00 AM

  1. అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులు.. 

20 ఏళ్లు అయినా పూర్తికాని వైనం...

తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..

తాడ్వాయి, డిసెంబర్, 8 (విజయ క్రాంతి): నాయకులు మారిన, ప్రభుత్వాలు మారిన ప్రజల బాధలు మాత్రం మారడం లేదు. ప్రజల ఇబ్బందులను పట్టించుకునే వారే కరవయ్యారు. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం వచ్చిన ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు.

నాయకుల,అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మిగిలిపోయింది నందివాడ, పోతాయిపల్లి రోడ్డు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పోతాయిపల్లి రోడ్డు నిర్మాణానికి 2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో నందివాడ నుంచి వయా పిర్మాయకుంట తండా మీదుగా లింగంపేట మండలం పోతాయిపల్లి ఐలాపూర్ వరకు బీటి రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.

అప్పటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ విషయమై అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తాడ్వాయి మండలం నందివాడ నుంచి ఐలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి అవుతే తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, నందివాడ,ఏండ్రియాల్, దేమికలాన్, కన్కల్, కరడపల్లి, తాడ్వాయి, చందాపూర్ ప్రజలకు ఎంతో మేలు సమకూరే అవకాశం ఉంది.

ఈ రోడ్డు నిర్మాణంతో మెదక్ పట్టణానికి వెళ్ళడానికి దూర భారం తగ్గుతుంది. లింగంపేట మండలంలోని కన్నాపూర్, పోతాయిపల్లి, కోమటిపల్లి, కొల్కంపేట, ఒంటరిపల్లి గ్రామాల ప్రజలకు కామారెడ్డి జిల్లా కేంద్రం చేరుకోవడానికి దూర భారం తగ్గుతుంది. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నాలుగు కిలోమీటర్ల రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి

పిరుమయకుంట తండా నుంచి పోతాయిపల్లి గ్రామం వరకు అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అధికారుల అలసత్వం కారణంగా రోడ్డు పనులు నిలిచిపోయాయి సదరు అటవీ శాఖ అధికారులు రోడ్డు పనులు చేయవద్దని అడ్డుకోవడంతో రోడ్డు నిర్మాణం పనులు చేయకుండానే సదరు కాంట్రాక్టర్ వెళ్లిపోయారు.

ఈ విషయమై లింగంపేట మండలంలోని పోతాయిపల్లి, కోమటిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట, తాడ్వాయి -  మండలంలోని ఎర్ర పహాడ్, నందివాడ, దేమికలాన్,ఏండ్రియాల్ గ్రామాల ప్రజలు చాలాసార్లు ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందించారు. అయినా సదరు నాయకులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

గుంతలమయమైనా రోడ్డు..

నందివాడ నుంచి పిర్మయకుంట తండా వరకు రోడ్డు పూర్తిగా గుంతల మయం అయిపోయింది. తండావాసులు ఆ రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారు. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. లింగంపేట మండలానికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్తున్నారు. దీంతో దూర భారం పెరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

రోడ్డు పనులు వెంటనే  ప్రారంభించాలి 

నందివాడ నుంచి పోతాయిపల్లి గ్రామం వరకు నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి . ఈ రోడ్డు పనులు పూర్తి అవుతే తమకు మెదక్ పట్టనం వెళ్లడానికి దూర  భారం తగ్గుతుంది. అధికారులు స్పందించి వెంటనే పనులు మొదలుపెట్టాలి.

- గణపతి, పిర్మాయకుంట తండా 

గుంతలమయమైన రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నాం..

నందివాడ నుంచి తండా వరకు రోడ్డు అద్వానంగా మారింది. అడుగడుగునా రోడ్డుపై గుంతలు పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నాం. వెంటనే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలి.

- గురునాయక్, పిరుమాయకుంట తండా