ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి
గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మార్చి 31(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్ కార్డ్, వ్యవసాయ తదితర ప్రభుత్వ పథకాల గురించి, ప్రజలకు వివరించాలని అన్నారు.
గ్రామసభల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతి కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రాంతంలో గ్రామసభలు నిర్వహణతో పాటు గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జాభితా చదివి వినిపించాలని ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే సభకు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు, తహశీల్దార్, ఎంపిడిఓ లు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. గ్రామ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామ సభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మంగళ వారం ఒక ప్రకటన తెలిపారు.




