7 July, 2026 | 2:42 PM

శిథిల భవనాలతో విద్యార్థుల్లో భయం.. భయం..

07-07-2026 01:55 PM
  1. నాడు కలకలలాడిన బడి.. నేడు శిథిలావస్థ
  2. పెచ్చులూడుతున్న పాఠశాల, అంగన్‌వాడి పైకప్పులు
  3. భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
  4. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

గంభీరావుపేట, జులై 7 (విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు నేడు శిథిలావస్థకు చేరుకుని వెలవెలబోతున్నాయి. భవనాల దుస్థితి కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడానికే వెనుకాడుతున్నారు.

శిథిలావస్థలో బరిగేలగూడెం ప్రాథమిక పాఠశాల

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని బరిగేలగూడెం ప్రాథమిక పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతింది. పైకప్పు పెచ్చులూడుతూ ఉండటంతో పాటు, వర్షాకాలంలో గోడలు, స్లాబ్‌ల నుంచి నీరు జొరబడుతోంది. కొన్ని చోట్ల సజ్జలు కూడా ఊడిపోతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంటగది లేక తరగతి గదే వంటగది..

మధ్యాహ్న భోజనం వండేందుకు వంటగది కూలిపోవడంతో, తరగతి గదినే వంటగదిగా మార్చి భోజనం సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

అంగన్‌వాడి భవనం కూడా ప్రమాదంలో.. అదే ప్రాంగణంలో ఉన్న అంగన్‌వాడి కేంద్రం భవనం కూడా శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడుతుండటంతో వర్షం పడితే చిన్నారులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం ఆరోపణలు..

పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్త భవనాలు నిర్మించాలి:- శనిగరపు నరేష్ వర్మ, ఎమ్మార్పీఎస్ నాయకుడు.

“ఒకప్పుడు మా బడి విద్యార్థులతో కళకళలాడేది. ఇప్పుడు భవనాలు శిథిలమైపోవడంతో పిల్లలను పంపడానికే భయంగా ఉంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలి” 

పాఠశాల అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి

శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ మల్లుగారి పద్మ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భవనాల దయనీయ స్థితి, మౌలిక వసతుల లోపాలపై సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు చేయించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే కాలనీ వాసుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపడతామని సర్పంచ్ మల్లు గారి పద్మ హామీ ఇచ్చారు.