బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?
రాష్ట్రంలో 6 నుంచి 10 మంది జిల్లా అధ్యక్షులు మార్పు.?
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ బీజేపీలో(Telangana BJP) త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని పలువురు జిల్లా అధ్యక్షుల పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని విశ్వాసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థాగత మార్పులపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల చర్చల ప్రకారం, రాష్ట్రంలోని సుమారు 6 నుంచి 10 మంది జిల్లా అధ్యక్షుల పనితీరుపై రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి పలు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.
పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతం, స్థానిక నాయకత్వ సమన్వయం వంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో పనితీరు లేదని పార్టీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కొన్ని కీలక మార్పులు తప్పనిసరి అని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది .ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లాల స్థాయిలో సంస్థాగత మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి






