29 July, 2026 | 12:57 AM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

29-07-2026 12:00 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వంద శాతానికి చేరేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. పారిగాం, అంబేద్కర్ నగర్ పాఠశాలలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం లోనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వరికి బదులుగా కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత రైతులకు సూచించారు.

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ అధికారులకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.  భూగర్భ జలాల మట్టం పెరిగేలా ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్లు, నీటి కుంటల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. వంజరి రైతు వేదికలో నిర్వహించిన సమీక్షలో జలసిరి పథకం పనులను వేగవంతం చేయాలని సూచించారు.

తెలంగాణ జీవనోపాధుల పథకం కింద తిర్యాణి, లింగాపూర్ మండలాలకు చెందిన అర్హులైన గిరిజనులకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ కె.హరిత పంపిణీ చేశారు. అర్హులందరికీ పింఛన్లు, జాబ్ కార్డులు, ఆధార్, బ్యాంకు ఖాతాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.