29 July, 2026 | 1:04 AM

పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు రైతుల ముందడుగు

29-07-2026 12:00 AM

కొండపాక, జులై 28: ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాఠశాల నిర్మాణం కోసం కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన కొందరు రైతులు విశేష ముందడుగు వేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 613లో కురుమ, యాదవ సంఘాలకు కేటాయించిన భూమిని పాఠశాల నిర్మాణానికి అందించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ, ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతికి కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా రైతుల విజ్ఞప్తిని పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి సానుకూలంగా స్పందించారు. వెంటనే కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి, సంబంధిత భూమిపై తక్షణమే సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్లు సమాచారం. గ్రామంలోనే ప్రతిష్టాత్మక పాఠశాల నిర్మాణం జరిగితే స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ యాదవ సంఘం సభ్యులు, బందారం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.