calender_icon.png 11 November, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూత

11-11-2025 12:59:35 AM

* కొంటూరు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

* మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, నవంబర్ 10(విజయక్రాంతి):రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని రాజ్ పల్లి, మల్కాపూర్ తండా, కోంటూర్ లలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన తర్వాత కోంటూరు పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం వంద శాతం రాయితీతో చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గ పరిధిలోని 546 చెరువులు, కుంటలలో 211.39 లక్షల చేప పిల్లలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 39 పెరినియల్ చెరువులలో 63.28 లక్షల 80-100 ఎంఎం సైజు గల చేప పిల్లలు, 507 సిసనల్ చెరువులలో 148.10 లక్షల 35-40 ఎంఎం సైజు గల చేపపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1728 చెరువులు, కుంటలు, పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులలో రూ.488.75 లక్షల విలువగల 550.88 లక్షల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోని 309 మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో గల 16,820 సభ్యులకు జీవనోపాధి కలగడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో రూ.35వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను సీఎం రేవంత్రెడ్డి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, అధ్యక్షులు ఎల్ల బోయిన ప్రశాంత్, డైరెక్టర్ జి.దేవేందర్, జి.అంజయ్య, సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.